అనుమానం – స్టొరీ

‘ఓ వదినా, చిన్నీని మీ బెడ్‌ మీద పడుకోబెడుతున్నా! బిట్టూకు టిఫిన్‌ ఇచ్చి వస్తా. అయ్యో పాల సీసా మరిచిపోయా ఇప్పుడే తెస్తా’ అని సరిత తానుండే పక్క ఫ్లాట్‌లోకి వెళ్ళబోయింది.

వంటింట్లోనుంచి కొంగుతో చేతులు తుడుచుకుంటూ వస్తూ ‘పాల సీసా వద్దూ ఏమీ వద్దు అది లేస్తే నేను పాలు గ్లాసుతో తాపిస్తా. అదిప్పుడు పెరుగుతుంది. డాక్టర్లు బాటిల్స్‌ వాడవద్దని ఎంత హెచ్చరిస్తున్నా మనం వింటే కదా? నువ్వు త్వరగా వెళ్ళు బిట్టూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అసలే వాడు నెమ్మదిగా తింటాడు, నీవు ఆలస్యంగా వెళితే బెల్లైపోద్ది. వాడు ఆకలితో ఉండిపోతాడు. దీన్ని నేను చూసుకుంటాగా?’’ అన్ని చిన్నీ పక్కనే తను పడుకొని నిద్రలో ఉన్న పాపను ముద్దాడసాగింది ఆఫ్రీన్‌. ఆ ముద్దులకు ఉక్కిరిబిక్కిరై పాప లేసి కుఁయ్‌.. అని కూనిరాగం మొదలుపెట్టింది. నా చిట్టి తల్లే అనుకుంటూ బుజ్జగించి పాలు తాపించి, తన పిల్లల బొమ్మలు వేసి అమ్మాయితో తనూ ఆడుకుంటూ కూర్చుంది ఆఫ్రీన్‌. పాప పుట్టినప్పటి నుండి అదే రొటీన్‌. ఆ పాపను సరితకన్నా తానే ఎక్కువగా చూసుకునేది. తన ఇద్దరు పిల్లలు కాస్త ఎదిగి 7,8వ తరగతుల్లో చదువుతూ ఉన్నారు. భర్త ఆపీసుకు, పిల్లలు స్కూల్‌కు వెళ్ళాక తనకు ఇంట్లో తోచేది కాదు కనుక చిన్నీ లాలనా పాలనే తనకు కాలక్షేపం.geeturai_weekly_23_2

ఆమె భర్త అబ్దుల్‌రహీమ్‌ ఆఫీసు నుంచి వస్తూ చిన్నీ అని కేక వేయగానే చిన్నీ పాకుకుంటూ బయటకు రావడం ఆయన దాన్ని ఎత్తుకుని ఇంటికి రావడం. అలా ఆయనకు మామూలైపోయింది. అప్పుడప్పుడు చిన్నీ మీ ఇంట్లోనే ఉందన్నయ్యా అని సరిత లోపల్నుండి జవాబిచ్చేది. భార్యాభర్తలిద్దరికేకాక వారి పిల్లలకు కూడా చిన్నీ, బిట్టూ అంటే ప్రాణం. అప్పుడప్పుడు తల్లి బిట్టూకు చెల్లిని తీసుకు రమ్మను అని బిట్టూతో కబురు పంపిస్తే వహీద్‌, ఉబైద్‌ ఇద్దరూ కలిసి ఇది మా చెల్లి. మీ ఇంటికెందుకు తీసుకురావాలి అని బిట్టూను ఏడిపించేవారు. వాడు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టగానే ఒరేయ్‌ నువ్వు కూడా మా తమ్ముడివేరా ఇది మనందరి చిన్నారి చెల్లి అని మందలించేవారు. అలా వారిలో ప్రేమానురాగాలు పెరుగుతూ పోయాయి. ఇరు కుటుంబాల మతాలూ, విశ్వాసాలు వేరైనా హృదయాలు మాత్రం ఒకటిగా ఉండేవి.

ఒకే కుటుంబీకులుగా మెలిగేవారు. ఉదయం రెండిరడ్లకు సరిపడే టిఫిన్‌ సరిత చేసేది. సాయంత్రం అందరికీ డిన్నర్‌ వడ్డించేది ఆఫ్రీన్‌. చిన్నీ మూడవ పుట్టినరోజున రాత్రి అతిథులందరూ వెళ్ళాక ఆఫ్రీన్‌ కుటుంబం ఇంకా అక్కడే ఉంది. గిఫ్ట్‌ రాప్స్‌ తీసి వచ్చిన గిఫ్ట్స్‌ను చూస్తూ ఉండగా ఆఫ్రీన్‌ చిన్నబ్బాయి ఉబైద్‌ ‘డాడీ నేను చిన్నీ పదహారవ పుట్టినరోజు హోటల్‌ వైస్రాయ్‌లో సెలబ్రేట్‌ చేస్తా’ అన్నాడు. అందరూ బిగ్గరగా నవ్వారు కానీ ` ఓహో అలాగే బేటా అక్కడే చేద్దాం ఇన్షాఅల్లాప్‌ా అన్నారు అబ్దుల్‌ రహీమ్‌. వహీద్‌ తమ్ముడ్నేడిపించడానికి ‘‘అది అంత గొప్ప హోటల్‌ అనుకుంటున్నావా ఏంటి? అది పెద్దగయ్యే వరకు సిటీలో దానికంటే పెద్దపెద్ద హోటల్స్‌ వచ్చేసి దాని విలువ తడికెల హోటల్‌గా మారిపోద్ది అప్పుడేం చేస్తావ్‌?’’ అన్నాడు. అందరూ గొల్లున నవ్వారు. ఉబైద్‌ అందర్నీ చూసి క్షణం ఆలోచించి ‘దానికంటే పెద్ద హోటల్‌ ఏదుంటే దాంట్లో సెలబ్రేట్‌ చేస్తా అని జవాబివ్వగానే సరిత దంపతులు తమ బిడ్డను అంతగా ప్రేమించే ఆ కుటుంబాన్ని చూసి మురిసిపోయారు. ఆఫ్రీన్‌ దంపతులు నిష్టగా తమ ధర్మాన్ని పాటించేవారు ఎవరికీ ఏ హాని కలిగించకుండా ఉండేవారు. బిల్డింగ్‌లో అందరితో వారికి స్నేహముండేది. అందరి మంచిచెడులలో పాలుపంచుకునేవారు.

ఆ బిల్డింగ్‌లో దాదాపు అందరూ హిందువులే ఆఫ్రీన్‌ కుటుంబం తప్ప. కాని ఎప్పుడూ ఎలాంటి కలహాలు లేకుండా జీవితం సాఫీగా గడిచేది. అకస్మాత్తుగా ఒకరోజు సిటీలో అలజడి రేగింది. నగరంలో ఒకచోట ప్రేలుడు జరిగిందనీ, దానికి కారకులు ముస్లిములేనని, ఇస్లాం తీవ్రవాదం అనీ, మీడియా పత్రికలూ ఒకే ధోరణిలో పెడబొబ్బలు పెట్టసాగాయి. మరుసటి రోజు ఆఫ్రీన్‌ సరిత కోసం ఎదురు చూడసాగింది. కాని సరిత ఎంతకూ రాలేదు. ఫోన్‌ చేసినా రిసీవ్‌ చేయలేదు.

ఆఫ్రీన్‌ సాయంత్రం వరకూవేచి చూసింది సరిత జాడలేదు. సాయంత్రం ఆఫీసు నుండి వస్తూ అబ్దుల్‌రహీమ్‌ చిన్నీని గడపలో చూసి తినుబంఢారాల పొట్లం చేతికందించ ప్రయత్నించారు. రోజులా దాన్ని సంతోసంగా తీసుకొని తన చేతివ్రేలిని పట్టుకొని తన ఇంటికి వచ్చే పాప ఆ రోజు ‘ఛ పో నేను రాను, మీరు హంతకులు’ అని లోనికెళ్ళి తలుపులేసుకుంది. ఆ మూడున్నర సంవత్సరాల పసిపాప నోట వెలువడిన మాటలు శూలల్లా హృదయంలో దూసుకుపోయాయి.

అతని చుట్టూ ఉన్న నిన్నటి ప్రపంచానికి నేటి ప్రపంచానికి పోలికే లేకుండా పోయింది. ఆ పాప ఒక్కటే కాక బిల్డింగులో ఉన్న వారందరూ ముభావంగా ఉండడం ప్రారంభించారు. ఆ బ్లాస్ట్‌ చేసిన వారెవరో కాదు అబ్దుల్‌ రహీమ్‌ అండ్‌ కుటుంబం అన్నట్లు వ్యవహరించసాగారు. వారినీ పిల్లల్ని చూసి ముఖం తిప్పుకునేవారు. ఏ తప్పు చేయకపోయినా నిన్నటివరకు ఆదరణీయులు నేడు నిందితులుగా మారిపోయారు. దేశవ్యాప్తంగా ఎందరో ముస్లిములు ఇలాంటి బాధకు గురవుతున్నారో దేవుడే ఎరుగును.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *