ఇస్లాంలో మహిళా సాధికారికత

` నిలోఫర్‌

దివ్యఖుర్‌ఆన్‌ ప్రకారం స్త్రీ, పురుషులు ఇరువురు సమానులే. స్త్రీ పురుషులు ఇరువురు ఒకే జీవి నుంచి సృష్టించబడ్డారు.

ఇస్లాం స్త్రీలకు పనిచేసే హక్కును, ఆస్తి, సంపదను కలిగివుండే హక్కును కలగజేసింది. ‘అల్లాప్‌ా మీలో ఎవరికైనా ఇతరులకు ఇచ్చిన దానికంటే ఎక్కువగా ప్రసాదించి వుంటే మీరు దానికి ఆశపడకండి. పురుషులు సంపాదించిన దానికి తగినట్లుగా వారి భాగం ఉంటుంది. స్త్రీలు సంపాదించిన దానికి తగినట్లుగా వారి భాగం ఉంటుంది. అయితే అల్లాప్‌ాను ఆయన అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాప్‌ా సకల విషయ పరిజ్ఞానం కలవాడు.’ (దివ్యఖుర్‌ఆన్‌ 4 : 32)

స్త్రీలు వైద్యం, బోధన, పరిపాలన, న్యాయ రంగాలలో పనిచేసే అవకాశాన్ని ఇస్లాం కలుగజేసింది. స్త్రీలు ఈ హక్కులను వివాహానికి ముందు, ఆ తర్వాత కూడా అనుభవించవచ్చు. ఇస్లామిక్‌ చరిత్రలో ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో స్త్రీల ప్రవేశంపై ఎటువంటి ఆంక్షలు లేవు. విశ్వాసుల తల్లి ఖదీజా బీబీ తన కాలం నాటి ముఖ్యమైన వ్యాపారవేత్త, ప్రవక్త(స) ఆమె వద్ద పనిచేస్తూ ఉండేవారు. విశ్వాసుల తల్లి ఆయెషా ప్రవక్త(స)కు ముఖ్య సలహాదారుల, అంతరంగికురాలు.

ఇస్లామిక్‌ యుగం ప్రారంభంలో స్త్రీలు సామాజిక జీవితంలోని విభిన్న రంగాలలో పనిచేయటంతోపాటు రాజకీయ ఉన్నత స్థానాలను ఆక్రమించారు. రెండవ ఖలీఫా ఉమర్‌ తన పరిపాలనా కాలంలో మదీనా మార్కెట్‌ వ్యవహారాలను నియంత్రించటానికి షఫా అనే స్త్రీని నియమించారు. ఖలీఫా ఉమర్‌ పాలనా వ్యవహారాలలో షఫా అభిప్రాయాన్ని పొందేవారు. సమ్రా బిన్తె నుహాయక్‌ మక్కా మార్కెట్‌ వ్యవహారాలను పర్యవేక్షించేవారు.

ఖలీఫా యుగం నాటి స్త్రీ కార్మికులు భిన్న సామాజిక రంగాలకు చెందినవారై వివిధ వృత్తులను, ఆర్థిక కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేవారు. కర్షకులుగా, నిర్మాణ కార్మికులుగా చర్మాలను శుద్ధిచేసేవారుగా, నేత పనివారిగా, వాణిజ్య వేత్తలుగా, పెట్టుబడిదారులుగా, వైద్యులుగా, నర్సులుగా, వ్యాపారశ్రేణుల నాయకులుగా, విద్యావేత్తలుగా వివిధ రంగాలలో స్త్రీలు రాణించేవారు. నేత, చర్మాల శుద్ధి, కుట్టు పనులలో వీరికి సాటి ఎవరూ లేరు.

ప్రఖ్యాత ఇస్లామిక్‌ తత్వవేత్త ఇబ్నె రుష్ద్‌ ప్రకారం స్త్రీ పురుషులు ఇరువురూ సమానులే. స్త్రీలు కూడా యుద్ధరంగంలో పాల్గొనేవారు. నుసైబాప్‌ా బిన్తె ఉమ్మె అమ్రా, ఆయెషా, కహుల, వఫెయిరా పేరుగాంచిన స్త్రీ యుద్ధ నిపుణులు. సుమయ్యా ఇస్లామిక్‌ చరిత్రలో మొట్టమొదటి అమరగతిని పొందిన మహిళ. రమలా ఉమ్మె సలీం ముస్లింల తరఫున ఉహుద్‌, ఖైబర్‌ యుద్ధాలలో పాల్గొన్నది. ఆమె యుద్ధ నిపుణత, యుద్ధంలో ఆమె చేసిన సేవలు కొనియాడదగినవి. నుసైబా ఉమ్మె అమ్రా మొదటి స్త్రీ ముస్లిం సైనికురాలు. ఉహుద్‌, హునైన్‌, యముమ, హుదైబియా యుద్ధాలలో ముస్లింల తరఫున పాల్గొన్నారు. ఉహుద్‌ యుద్ధంలో తన ప్రాణాలకు తెగించి ప్రవక్త(స) ముహమ్మద్‌ను కాపాడారు. ఫషా బిన్తె అద్వియ వైద్య రంగంలో పేరుగాంచింది.

ఆయెషా బిన్తె అబూబకర్‌, నఫీసా, ఫాతిమా అల్‌ ఫిహారి, కరీమా, జైనబ్‌ బిన్తె అబ్దుల్‌ రహ్మాన్‌, అల్‌ ఆలియా ప్రముఖ స్త్రీ హదీసు పండితులు. హఫ్సా బిన్తె అల్‌ అన్సారియా, అమహా అల్‌ వాహిద్‌, ఆయెషా అల్‌ బంశీయా ఉమ్‌ అల్‌ ప్రఖ్యాత స్త్రీ న్యాయవేత్తలు. ఉర్వా బిన్తె అహ్మద్‌, భూరాన్‌ పాలనా నిపుణులు. రుసా వైద్యశాస్త్రంపై గ్రంథం రచించారు. ముస్లిం స్త్రీలు వైద్యశాలలో నర్సులుగా పనిచేసేవారు. మహిళా ఆసుపత్రులలో మహిళా వైద్యులుగా పనిచేసేవారు. 12వ శతాబ్దానికి చెందిన భానుజార్‌ కుటుంబానికి చెందిన ఇరువురు మహిళా వైద్యులు ఉండేవారు. 15వ శతాబ్దంలో మహిళా శస్త్రచికిత్స నిపుణులు ఉండేవారు.

ఇస్లాం కొన్ని పరిమితులకు లోబడి స్త్రీలు ఉద్యోగం చేయటానికి అనుమతినిస్తుంది. తన ఆర్థిక అవసరాలను తీర్చుకోవటానికి, భార్యగా, తల్లిగా తన స్థానానికి భంగం కలగనంత వరకు స్త్రీ ఉద్యోగం చేయవచ్చు. ఇస్లామిక్‌ వాతావరణంలో ఇస్లామిక్‌ చట్టాలకు లోబడి స్త్రీలు పనిచేయవచ్చు. అనేక ఇస్లామిక్‌ దేశాలలో స్త్రీలు తమ హక్కులకు, తమ స్థానానికి భంగం కలుగకుండా విధులు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్‌లో 10%మందిస్త్రీలు, ఇండోనేషియాలో 52%స్త్రీలు ఉద్యోగ నిర్వహణలో ఉన్నారు.

దివ్యఖుర్‌ఆన్‌లో ఇరువురు స్త్రీ పశువుల కాపరుల ప్రస్తావన ఉంది. (దివ్యఖుర్‌ఆన్‌ 28: 23). అదేవిధంగా విశ్వాసుల తల్లి ఖదీజా వాణిజ్యవేత్త, ఇస్లామిక్‌ స్త్రీలకు ఆదర్శప్రాయురాలుగా పరిగణించబడుతుంది.

ఆధునిక యుగంలో రాజకీయరంగంలో స్త్రీ సాధికారత సాధించిన మహిళలుగా బేనజీర్‌ భుట్టో (పాకిస్తాన్‌), మెగవతి సుకర్నోపుత్రి (ఇండోనేషియా), తన్సు సిల్లర్‌ (టర్కీ), బేగమ్‌ ఖలీదా జియా (బంగ్లాదేశ్‌), హసీనా (బంగ్లాదేశ్‌)లను పేర్కొనవచ్చు.

ఇస్లాం ప్రకారం స్త్రీ సమాజంలో ఒక అంతర్భాగం. స్త్రీ విద్యాభివృద్ధి, స్త్రీసాధికారత సాధించని సమాజాలు అభివృద్ధిని సాధించలేవు. స్త్రీ సాధికారతలో విద్యను పొందడం ఒక ముఖ్యమైన భాగం. అవకాశాలను అందిపుచ్చుకోని సాధికారత సాధించడానికి ఉన్నతవిద్య, సువిద్య తోడ్పడుతుంది. స్త్రీల పట్ల ఉన్న సామాజిక దురభిప్రాయాలను తొలగించడానికి విద్య తోడ్పడుతుంది. ఇస్లాం స్త్రీలకు ప్రసాదించిన ఒక ముఖ్యమైన హక్కు విద్యార్జన. విద్య అనేది ప్రతి ముస్లిమ్‌ స్త్రీ పురుషుడు పొందవలసిన ముఖ్యమైన విధి. విద్య ద్వారా స్త్రీ సాధికారతను సాధించవచ్చును.

‘‘స్త్రీ ఉనికి ప్రపంచానికి వెలుగునిస్తుంది. జీవితమనే సంగీత వాయిద్యంలో స్త్రీ ప్రధాన వాయిద్యం’’ ` మహాకవి ఇక్బాల్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *