ఉన్మాద చర్య

మహారాష్ట్రలోని పూణె  నగరానికి  ఒక ప్రత్యేకత ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు…  వివిధ దేశాల నుంచి  సైతం వేల సంఖ్యలో యువతీ యువకులు ఏటా మంచి చదువుల కోసం, ఉపాధి కోసం అక్కడికి వస్తుంటారు. ఆ నగరాన్ని  ఆలంబనగా  చేసుకుని నిలదొక్కుకోవడానికి,  మెరుగైన జీవితం పొందడానికి, ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రయత్నిస్తారు. ఆ రకంగా అది అవకాశాల నగరం. ఆశావహుల నగరం. భిన్న భావా లకూ,  సంస్కృతులకు వేదిక. అలాంటి చోట  ఒక  యువ ఐటీ రంగ నిపుణుడు మొహిసిన్‌ సాదిక్‌ షేక్‌ కొందరు ఉన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు. హాకీ స్టిక్‌లతో వచ్చిన 20 మంది వారం క్రితం మూకుమ్మడిగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  మూడు రోజుల క్రితం ఆ యువకుడు మరణించాడు. ఈ దాడికి పాల్పడినవారికీ, సాదిక్‌ షేక్‌కూ మధ్య వ్యక్తిగత తగాదాలు లేదా విద్వేషాలులేవు. అసలు  అతడెవరో, ఏం చేస్తుంటాడో కూడా దాడి చేసినవారికి తెలియదు. ముస్లింగా గుర్తుపట్టేలా ఉన్నందువల్ల మాత్రమే అతన్ని కొట్టి చంపారని పోలీ సులు చెబుతున్నమాట. మార్ఫింగ్‌ చేసిన ఛత్రిపతి  శివాజీ చిత్రాలు ఫేస్‌బుక్‌లో చక్కర్లు కొడుతున్న కారణంగా ఉద్రిక్తతలు అలుముకున్నాయని, దీనికితోడు శివాజీ విగ్రహంపై రాళ్ళు రువ్వినట్టు వదంతులు బయల్దేరాయని, పర్యవసానంగా సాదిక్‌ షేక్‌పై దాడి జరిగిందని వారంటున్నారు. అరెస్టయినవారంతా స్థానికంగా పనిచేస్తున్న హిందూ రాష్ట్ర సేనకు చెందినవారు.geeturai_weekly_magazine_17_2

విద్వేషం దృష్టిని మసకబారుస్తుంది. ఉన్మాదానికి దారితీస్తుంది. దానికి హేతువుతో పనిలేదు. ఎదుటనున్నది ఎవరన్న విచక్షణ లేదు. ఇలాంటి విద్వేషానికి వదంతులు తోడైతే దానికిక పట్టపగ్గాలుండవు. పూణెలో జరిగింది అదే. తమ విశ్వాసానికో, తాము గాఢంగా  ప్రేమిస్తున్న  నాయకుడికో అప చారం  జరిగిందని  వదంతులు వెలువడి నప్పుడు లేదా సోషల్‌ నెట్‌వర్క్‌లో వారిని జుగుప్సాకరమైన రీతిలో చిత్రీకరించారని, అవమానకరమైన పద్ధతుల్లో విమర్శిం చారని  అనుకున్నప్పుడు పోలీసులకు పిర్యాదు చేయడం బాధ్యత గలవారు చేసే పని. కొందరు  దుండగుల వల్ల సమా జంలో  సామరస్యానికి విఘాతం కలుగు తున్నదని భావించేవారు, సమాజ సంక్షేమం పట్ల ఆందోళన ఉన్నవారు మొట్టమొదట చేయవలసింది అదే. మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండేవారు అలాగే చేస్తారు. అంతే తప్ప మారణాయుధాలు ధరించి వీరంగం వేయరు. వదంతులు ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడతాయో చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి. రెండేళ్ళ క్రితం అసోంలో బయలుదేరిన వదంతులు పలు జిల్లాల్లో బోడోలకూ, మైనార్టీ వర్గాలకూ మధ్య ఘర్షణలకు కారణమై ఎందరో మర ణించారు. వేల సంఖ్యలో గృహదహనాలు సాగాయి. ఏణ్ణర్థం క్రితం దేశంలోని వివిధ ప్రాంతాల్లో  స్థిరపడిన ఈశాన్య ప్రాంత వాసులు భారీ సంఖ్యలో స్వస్థలాలకు తరలివెళ్ళడం కూడా ఇలాంటి వదంతుల పర్యవసానమే. ఇవన్నీ మారుమూల పల్లెటూళ్ళలోనో, మనమంతా ‘అనాగరిక సమాజాలు’గా ముద్రవేసే ప్రాంతాల్లోనో జరుగుతాయనుకుంటాం. మహా నగరాలుగా, నాగరికతకు ఆనవాళ్ళుగా చెప్పుకుంటున్నచోట విశాల దృక్పథమూ, ఉదారవాద భావాలూ ఉంటాయని, నిత్యమూ అక్కడ రెప్పవాల్చని నిఘా కూడా ఉంటుందని భావిస్తాం. కానీ, పూణె వంటి చోట ఎవరో ఆకతాయిలు సోషల్‌ నెట్‌వర్క్‌లో మార్ఫింగ్‌కు పాల్పడటం, ఆ వెనుకే కొన్ని వదంతులు వెలువడడం.. .వెనువెంటనే వాటితో ఏమాత్రమూ సంబంధంలేని యువకుడొకరు ప్రాణాలు కోల్పోవడం ఎంత ఘోరం!

సమాజమంతా తలదించుకోవాల్సిన ఈ నేరంపై  కాంగ్రెస్‌  నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం స్పందనే అంతంతమాత్రంగా ఉన్నదని,  చర్యలు  తీసుకోవడంలో ఎడతెగని జాప్యం  చేసిందని విమర్శలు వచ్చాయి. అయితే,స్థానిక బిజెపి ఎంపీ అనిల్‌ షిరోల్‌ ఈ ఉదంతంపై మాట్లాడిన తీరు మరింత దారుణంగా ఉంది. ఫేస్‌  బుక్‌లో వచ్చిన చిత్రాలు బాధాకరమైనవని, అందుకు   ఇలాంటి  పర్యవసానాలు సహజమేనని ఆయన వ్యాఖ్యానించారు. దుండగులు వీధుల్లో వీరంగం వేయడం, సంబంధంలేని వారిపై దాడులకు దిగి ఒక యువకుడిని బలిగొనడం ‘సహజమే’నని ఆయన ఎలా అనగలిగారో ఆశ్చర్యం కలిగి        స్తుంది. పూణె ఉదంతంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుండగా దాన్ని వేలెత్తి చూపి తన నియోజకవర్గంలో అశాంతిని రేకెత్తించడానికి కారకులైనవారిని కట్టడి చేయమని  ఆ ఎంపీ డిమాండ్‌ చేయాలి. కానీ,  ఆయన సైతం దుండగు లను సమర్థించేలా మాట్లాడటం విచార కరం. సార్వత్రిక  ఎన్నికల్లో కులమతాల కతీతంగా ప్రజలు బిజెపికి ఓటు వేశారు. ముఖ్యంగా  యువత  నరేంద్రమోడీ అభివృద్ధి నినాదానికి ఆకర్షితులయ్యారు. అందుకు తగ్గట్టుగానే మోడీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన రోజునుంచే వరుస చర్యలు ప్రారంభించారు. ఆ చర్యలు అందరిలోనూ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఎన్నికల ప్రచార పర్వంలో మోడీపైన కాంగ్రెస్‌, ఇతర పార్టీలు చేసినదంతా దుష్ప్రచారమేనన్న భావమూ ఏర్పడుతున్నది. ఈ ఉదంతంలో సైతం కేంద్ర  హోంమంత్రిత్వ  శాఖ చురుగ్గా స్పందించి ఏం జరిగిందో తెలుసుకోవ డానికి ప్రయత్నించింది. ఇలాంటి దశలో బిజెపి ఎంపీ చేసిన వ్యాఖ్యానం అందరినీ దిగ్భ్రాంతి పరుస్తుంది. మైనార్టీ వర్గాల్లో అభద్రతా భావాన్ని రేకెత్తిస్తుంది. పూణె             ఉదంతంలో అసహనంతో, ఉన్మాదంతో రెచ్చిపోయి దాడులకు దిగిన సంస్థలను, వ్యక్తులను కట్టడి చేయడంలో ఏమాత్రం అలసత్వాన్ని ప్రదర్శించినా అది ప్రతికా రేచ్ఛను పెంచుతుంది. సమాజశ్రేయస్సుకు ఇది ఎంతమాత్రమూ దోహదపడదని అన్ని పక్షాలు గుర్తించాలి. ఈ ఉన్మాదాన్ని మొగ్గలోనే తుంచాలి.

(2014 జూన్‌ 8 ఆదివారం, సాక్షి దినపత్రిక సౌజన్యంతో…)

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *