కొన్ని ప్రశ్నలు

మీడియా ఇటీవల ఒక కొత్త ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగించింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం పనితీరును కేంద్ర ప్రభుత్వ పనితీరుతో పోల్చి చూడడం. కాని ఒక రాష్ట్ర ప్రభుత్వ పనితీరును, సాధించిన విజయాలను, వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వ పనితీరుతో పోల్చి చూడడం కుదరదన్న కనీస అవగాహన మన బడా బడా మేధావి పాత్రికేయులకు లేదా?

గుజరాత్‌ ప్రభుత్వం పనితీరును మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, పంజాబ్‌ వంటి ఇతర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుతో పోల్చగలమే కాని కేంద్ర ప్రభుత్వ పనితీరుతో ఎలా పోల్చగలం. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వ బాధ్యతలు, రాష్ట్రాల బాధ్యతల కన్నా చాలా ఎక్కువ. రక్షణశాఖ, విదేశాంగ వ్యవహారాలు, అంతర్జాతీయ వాణిజ్యం వగైరా ముఖ్యమైన, కీలకమైన బాధ్యతలను కేంద్రప్రభుత్వం నిర్వర్తించవలసి              ఉంటుంది. కాబట్టి యుపిఏ ప్రభుత్వ పనితీరును పోల్చవలసి వస్తే అంతకు ముందు పనిచేసిన ఎన్‌డీఏ ప్రభుత్వ పనితీరుతో పోల్చగలమే కాని ఒక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో పోల్చలేము. విదేశీ వ్యవహారాల విషయంలో కాని, భద్రత పరమైన విషయాల్లో కాని, ప్రగతి, ధరల పెరుగుదల తదితర విషయాల్లో కాని యుపిఏ ప్రభుత్వాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వంతో పోల్చవలసింది.

అలాగే సోనియా గాంధీ వెనుక ఉండి అధికారం చెలాయించారన్న ఆరోపణ కూడా బలంగా వినిపించింది. ఇందులో వాస్తవాలు ఉండొచ్చు, కాని వాజపేయి ప్రభుత్వం స్వేచ్ఛగా పనిచేసే అవకాశాన్ని సంఫ్‌ుపరివార్‌ అప్పట్లో ఇచ్చిందా అన్న ప్రశ్న కూడా ఇక్కడ సముచితమైనది. అంత స్వేచ్ఛగా వాజపేయి పనిచేసి ఉంటే సరే, కాని కొందరు ఆరోపించినట్లు ఆయన కేవలం ఒక ముఖోటా ప్రధానిగా పనిచేసి ఉంటే యుపిఏకు, ఎన్‌డిఏకు తేడా ఏమిటి?

కామన్‌వెల్త్‌ గేమ్స్‌, 2జి, కోల్‌గేట్‌ స్కాముల ఆరోపణలు యుపిఏలో వచ్చాయి. అలాగే తెహల్కా బట్టబయలు చేసిన కాఫిన్‌ల స్కాములో అప్పటి బిజేపి అధ్యక్షుడు బండారు లక్ష్మణ్‌ ఆయుధ వ్యాపారుల నుంచి సొమ్ము తీసుకున్నట్లు బయటపడిరది. అప్పటి రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండజ్‌ కూడా రాజీనామా చేయక తప్పలేదు. ఇంకా ఇలాంటి అవినీతి ఆరోపణలు అప్పుడు కూడా ఉన్నాయి.

వృద్ధిరేటు విషయానికి వస్తే యుపిఏ వన్‌ విషయంలో ఎవరూ మాట్లాడడంలేదు. కాని యుపిఏ టు కన్నా ఎన్‌డీఏ వృద్ధిరేటు ఎక్కువ అంటున్నారు. కాని అమెరికా కూడా కొట్టుమిట్టాడిన ఆర్ధిక సంక్షోభ కాలంలో యుపిఏ 2చక్కగా పనిచేసిందని చాలా మంది విశ్లేషకులంటున్నారు.

కార్గిల్‌యుద్ధం, పార్లమెంటుపై దాడి, ముంబయిలో 26/11 ` యుపిఏ, ఎన్‌డీఏ రెండు ప్రభుత్వాల కాలంలోనూ భద్రతకు సవాళ్ళు ఎదురయ్యాయి. వీటన్నింటిపై మీడియాలో చర్చ జరగవలసింది. కాని అలాంటి చర్చ జరగలేదు. దావూద్‌ ఇబ్రాహీంను పట్టుకోవడంలో యుపిఏ, ఎన్‌డీఏ ప్రభుత్వాలు రెండు విఫలమయ్యాయి.

రెండు ప్రభుత్వాలకు సంబంధించి ఈ విషయాలపై మీడియాలో ఎలాంటి చర్చ జరగలేదు.

చర్చ కేవలం బీజేపికి అనుకూలంగానే జరిగింది. ఇలా ఎందుకు జరిగిందన్నదే ప్రశ్న.

Check Also

ఫలితాలు

ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కొందరికి సంతోషాన్నిచ్చాయి. కొందరికి విషాదంగా మారాయి. ఈ ఎన్నికల ఫలితాలను ఊహించనివారిలో సహజంగానే నిరాశ కమ్ముకుంటుంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *