చట్టం అమలులో అలసత్వమే కబ్జాకు కారణం

వక్ఫ్‌బోర్డు ప్రత్యేక అధికారి షేక్‌ ముహమ్మద్‌ ఇక్బాల్‌

` రహ్మత్‌

వక్ఫ్‌ఆస్తుల పరిరక్షణ కోసం ఉద్దేశించిన చట్టాల అమలులో అలసత్వమే ఆస్తుల కబ్జాకు దారితీస్తోంది. చట్టాలను కచ్చితంగా అమలు చేస్తే కబ్జాదారుడికి జైలు తప్పదు. ఈ భయం ఉంటే చాలు వక్ఫ్‌ ఆస్తులను దురాక్రమించే దుస్సాహసం ఎవరూ చేయరు అంటున్నారు వక్ఫ్‌బోర్డు ప్రత్యేక అధికారి షేక్‌ ముహమ్మద్‌ ఇక్బాల్‌. భారతదేశంలోనే ఎక్కడాలేని విధంగా సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్నంతగా మరే రాష్ట్రంలోనూ వక్ఫ్‌ ఆస్తులు లేవు. మరెక్కడా లేని విధంగా ఈ ఆస్తుల ఆక్రమణ జరిగింది ఇక్కడే. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటివరకు వక్ఫ్‌ భూముల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయడంతో వక్ఫ్‌ఆస్తులను కబ్జా చేసిన అవినీతిపరులకు ఆయన సింహస్వప్నంగా మారారు. వక్ఫ్‌ఆస్తుల పరిరక్షణ ఒక వక్ఫ్‌బోర్డుదే కాదని రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ శాఖ, జిల్లా కలెక్టర్‌, డిఆర్‌ఓ, పోలీసు శాఖ ఇలా అందరికీ బాధ్యత ఉందని ఆయన చెప్పారు. వీటికి సంబంధించి ప్రభుత్వ జీవోలు కూడా ఉన్నాయని చెప్పిన ఆయన వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణలో ఎవరెవరి బాద్యత ఉంది అన్నది గుర్తుచేసే పనిలో తాము నిమగ్నమవుతున్నామని చెప్పారు. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణయే తన ద్యేయమని, ఈ విధి నిర్వహణలో ఎవరికి తలొంచేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వక్ఫ్‌ బోర్డు ప్రత్యేక అధికారిగా ఎవరి పైరవీ చేత రాలేదని, ఎవరి పైరవిచేతనో ఇక్కడ ఉండటానికి ప్రయత్నించనని అల్లాప్‌ా దయతో ఇక్కడకు వచ్చానని చెప్పారు. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ కోసం చేపట్టనున్న భవిష్యత్‌ కార్యాచరణను ఆయన గీటురాయి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలను తెలిపారు.

ప్రశ్న : రాష్ట్రంలో కబ్జాకు గురైన వక్ఫ్‌ఆస్తుల పరిస్థితి ఏమిటి?

జ : వక్ఫ్‌ లెక్కల ప్రకారం ఈ బోర్డు కింద రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్షా యాబై వేల ఎకరాల భూమి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు వీటిలో 75శాతం కబ్జాకు గురైంది. ఈ ఆస్తులను మొత్తంగా ఇప్పటికి కాపాడి ఉంటే లక్ష కోట్ల రూపాయలకు పైగానే వీటిపై అద్దెల కిందా, లీజు కిందా ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు ఆస్తుల నుంచి ఏడాదికి రూ.10కోట్లకు మించి ఆదాయం రావడంలేదు. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. వాస్తవం ఏమిటంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్‌లో వక్ఫ్‌ఆస్తులు ఉన్నాయి. దేశంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడే వక్ఫ్‌ భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఈ ఆస్తుల పరిరక్షణ చేస్తే వీటి ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని పేద ముస్లింల జీవితాలను ఉన్నతంగా తయారు చేయవచ్చు.

ప్రశ్న : మరి ఆ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకొనే ప్రయత్నం సాగుతోందా…?

జ : ఆ ఆస్తులను మొత్తంగా స్వాధీనం చేసుకోవాలన్నది మా తపన, ప్రయత్నం. ఇందుకోసం సుదీర్ఘ ప్రణాళికతో ముందుకెళ్తున్నాం.

ప్రశ్న : ఆ ప్రణాళిక ఏమిటో వివరిస్తారా?

జ : కచ్చితంగా వివరిస్తాను. కానీ ఇంతకంటే ముందు ఓ వాస్తవం, ఓ నిజం మనం తెలుసుకోవాలి. వక్ఫ్‌ఆస్తుల పరిరక్షణ కేవలం వక్ఫ్‌ బోర్డుది అని, ముతవల్లీలు, బోర్డు కమిటీ మెంబర్లే చూసుకొంటారని, ఈ ఆస్తుల పరిరక్షణలో ఎవరి బాధ్యత లేదని ప్రజల్లో ఓ అపోహ ఉంది. ఈ అపోహ నేపథ్యంలోనే వేల ఎకరాలు వక్ఫ్‌ భూమి కబ్జాకు గురైంది. కానీ వాస్తవం ఏమిటంటే జీఓ 59ప్రకారం ఈ ఆస్తుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వంతోపాటు వక్ఫ్‌బోర్డు, రెవిన్యూ, జిల్లా కలెక్టర్‌, డీఆర్‌ఓ, పోలీసు అధికారులకు అందరికీ బాధ్యత ఉంది. ఇంకో విషయం ఏమిటంటే డీఆర్‌ఓనే జిల్లా వక్ఫ్‌బోర్డు అధికారి. ఈ వ్యవస్థలన్నీ ఏకతాటిపైకి వచ్చి పని చేసినప్పుడే వక్ఫ్‌ ఆస్తులు పరిరక్షింపబడతాయి. వక్ఫ్‌ బోర్డు అధికారులకు ఆస్తులు దురాక్రమణకు గురైనట్లు తెలిసినా వారికి జిల్లా రెవిన్యూ యంత్రాంగం, పోలీసు శాఖ మద్దతు లేనిది వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం సాధ్యపడదు. ఇదే భూ కబ్జాదారులకు వరంగా మారుతుంది.  తాము కబ్జా చేసినా ఎవరూ ఏమీ చేయరన్న ధీమాను వారిలో పెంపొందించి వక్ఫ్‌ ఆస్తుల పరిస్థితి ఇంతగా దిగజారేలా చేసింది.

ప్రశ్న : మరి ఆ దిశగా మీ కృషి సాగుతోందా..?

జ : ఓ.. సాగుతోంది. అంతేకాకుండా సవరించబడిన వక్ఫ్‌ కొత్త చట్టం ప్రకారం భూకబ్జాదారుల నేరం రుజువైతే కచ్చితంగా జైలు తప్పదు. అది ఆచరణలో చేసి చూపితే ఈ భూకబ్జాదారులు దారిలోకి వస్తారు. ప్రస్తుతం మేం కబ్జాకు గురైన వక్ఫ్‌ఆస్తుల పరిరక్షణ కోసం వాటి వివరాలతో కూడిన లేఖలను రెవిన్యూ శాఖ, సిసిఎల్‌ఏ, ప్రభుత్వ సీఎస్‌, జిల్లా కలెక్టర్లకు, డీఆర్‌ఓలకు రాశాము. కర్నూలు, నల్గొండ, మెదక్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్లతో ఇప్పటికే ఈ ఆస్తుల పరిరక్షణకు సంబంధించి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా రెవిన్యూ సదస్సులలో ఈ వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ అంశాన్ని ఓ అజెండాగా చేర్చడం జరిగింది. కానీ ఈ సదస్సులు జరగలేదు.

ప్రశ్న : కొంతమంది సంరక్షకులుగా ఉన్న వ్యక్తులు వక్ఫ్‌ఆస్తులపై తమదే ఆధిపత్యం అన్నట్టు వ్యవహరిస్తున్నారు కదా..?

జ : ఇది చాలా మంచి ప్రశ్న. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ కోసం నియమించబడిన  ముతవల్లీలు ఈ ఆస్తులకు కేర్‌టేకర్స్‌ (సంరక్షకులు) మాత్రమే. అంతకుమించి వీరికి ఆ ఆస్తులపై, వాటి ఆదాయంపై ఎలాంటి అధికారం ఉండదు. ఈ ముతవల్లీలకు వక్ఫ్‌నుంచి వచ్చే ఆదాయంలో కొంత శాతం ఇవ్వాలన్నా వక్ఫ్‌ బోర్డు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అదే సందర్భంలో వక్ఫ్‌ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయంలో ఎలాంటి పైకం ముతవల్లీలకు ఇవ్వకపోవచ్చు. అంటే ఇక్కడ ముతవల్లీలు ఉచిత సేవ చేయాలని కూడా ఉండొచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ఆస్తిని వక్ఫ్‌ చేసిన వ్యక్తి ఆ ఆస్తిపై వచ్చిన ఆదాయంలో ముతవల్లికి ఇనాం కింద ఇంత ఇవ్వాలి అని రాసి ఉంటే మాత్రమే ఆ ముతవల్లికి కొంత పైకం వక్ఫ్‌ బోర్డు చెల్లిస్తుంది. అంతేతప్ప వక్ఫ్‌ ఆదాయం తినడానికి ముతవల్లీలు ఏ మాత్రం అర్హులు కారు. అలా ఆదాయం అక్రమంగా తింటే వారిపైనా కలెక్టర్‌కు గాని, డిఆర్‌ఓకు గాని, పోలీసు యంత్రాంగానికి గానీ, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు అధికారులకు గానీ తెలియజేసి ఆయనపై చర్యలు తీసుకోవచ్చు.

ప్రశ్న : వక్ఫ్‌ ఆస్తులపై ముతవల్లీల పాత్ర ఏ మేర ఉంటుంది?

జ : ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే ముతవల్లీల పాత్ర వక్ఫ్‌ఆస్తులపై పరిమితం అని తెలియనందువల్లనే కంచె చేను మేసిన పరిస్థితి తలెత్తుతోంది. వక్ఫ్‌ యాక్ట్‌ 101ప్రకారం ముతవల్లి కూడా ప్రజా సేవకుడే. అంటే ప్రభుత్వ అధికారి తరహా హోదానే. వక్ఫ్‌ బోర్డు అధికారులు వక్ఫ్‌ ఆస్తులకు ఎలా పరిరక్షకులుగా ఉంటారో ముతవల్లీ సైతం అంతే పాత్రను కలిగివుంటాడు. వక్ఫ్‌ ఆస్తులకు ముతవల్లీ అనే వ్యక్తి కేవలం సంరక్షకుడు మాత్రమే. అతను ఆ ఆస్తులను సంరక్షించే వరకే బాద్యత ఉంటుంది తప్ప అతని ఇష్టానుసారం అమ్మేసుకోవడానికి, కబ్జా చేసుకోవడానికి, దాని ఆదాయం తినేయడానికి హక్కు ఉండదు. వక్ఫ్‌ మీద వచ్చిన ఆదాయంలో ఈ ముతవల్లీ ఏడు శాతం నిధులు వక్ఫ్‌ బోర్డుకు, మిగతా 93శాతం నిధులు పేద ముస్లింల అభివృద్ధికి ఖర్చుచేయాలి. అంతేకాని ఇందులో ఒక్క రూపాయి ముతవల్లీ తినేందుకు అధికారం ఉండదు. పైగా వక్ఫ్‌ బోర్డుకు తన ఆస్తిని వక్ఫ్‌ చేసిన వ్యక్తి ఆ ఆస్తిని సంరక్షించేవారికి ఇనాం కింద ఇంత ఇవ్వాలి అని రాసి ఇచ్చినప్పుడు సంరక్షకులుగా ఉన్న ముతవల్లీలకు ఆ మేరకు పైకం ఇస్తారు. లేక వక్ఫ్‌బోర్డు నిర్ణయం తీసుకొని ఎంతో కొంత ముతవల్లీలకు ఇవ్వవచ్చు. ఈ విషయాన్ని రాష్ట్రంలోని ముస్లిం సమాజం గమనించి అన్యాయాన్ని నిలదీయాలి. ఇక్కడ వివరించిన దానికి భిన్నంగా వక్ఫ్‌ ఆస్తులను, వాటి ఆదాయాన్ని అన్యాయంగా మెక్కితే మాత్రం వారిపై కూడా ఎసీబీ, ఐపిసి సెక్షన్‌ కింద కేసులు నమోదు చేయవచ్చు.

ప్రశ్న : చాలా వక్ఫ్‌ భూములు రెవిన్యూ రికార్డ్సు కింద మార్చేసి కబ్జాకు పాల్పడుతున్నారు కదా…?

జ : ఇది పూర్తి వాస్తవం. వక్ఫ్‌ ఆస్తులు చాలా వరకు కబ్జాకు గురైన తీరు ఇదే. కానీ ఈ వక్ఫ్‌ ఆస్తులను రెవిన్యూ రికార్డు కింద ఓఆర్‌సి (ఆక్యుపెన్సీ రైట్‌ సర్టిఫికేట్‌) ఇచ్చే వీలు ఉండదు. ఇతర ప్రభుత్వ భూముల్లో ఎవరైనా కబ్జాకు ఉండి ఆ తరువాత ఓఆర్‌సి పొందే వీలుంటుందేమో గానీ వక్ఫ్‌ఆస్తులు గానీ ఎండోమెంట్‌ భూములను ఆక్రమించి ఓఆర్‌సి పొందే వీలుండదు. కాబట్టి రెవిన్యూ రికార్డుల కింద మార్చి ఓఆర్‌సి పొందిన వక్ఫ్‌ భూములపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇది వక్ఫ్‌ భూములు అని ప్రతి జిల్లాలో గుర్తించి, ఓఆర్‌సి పొందిన వాటిని రద్దు చేయించి తిరిగి ఆ ఆస్తులను వక్ఫ్‌ బోర్డు స్వాధీనం చేసుకొనే ప్రయత్నాలు సాగుతున్నాయి.

ప్ర: వక్ఫ్‌ భూముల్లో వెలిసిన ల్యాంకో హిల్స్‌ పరిస్థితి ఏమిటి..?

జ : ల్యాంకో హిల్స్‌ కింద ఉన్న భూములు ముమ్మాటికీ వక్ఫ్‌ భూములే. వాటిని తిరిగి స్వాధీనం చేసుకొనే ప్రయత్నం సాగుతోంది. కేసు కోర్టులో ఉంది. ఈ కేసు చివరి దశకు వచ్చింది.

ప్రశ్న : వక్ఫ్‌ ఆస్తులపై వస్తున్న అద్దెలు నామమాత్రంగా ఉంటున్నాయి కదా..?

జ : నామమాత్రంగా కాదండి దారుణంగా ఉన్నాయి. నేను బాధ్యతలు తీసుకున్నాక వాటి గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయాను. అనంతపురం జిల్లా యల్లార్తి దర్గాకు సంబంధించి వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించి నలభై ఏళ్ళ నుంచి వక్ఫ్‌ బోర్డుకు పైసా ఆదాయం రాలేదు. ఈ రకంగా నలబై ఏళ్ళలో వక్ఫ్‌ బోర్డు ఒక్క యల్లార్తి దర్గాకు సంబంధించిన ఆస్తుల ఆదాయమే వందల కోట్లరూపాయలను నష్టపోయింది. పరిస్థితి ఇది. ఇంకా ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ విషయం తెలిసాక అన్ని దర్గా ఆస్తులపై దృష్టి సారించి వాటిని వక్ఫ్‌ బోర్డు పరిధిలోకి తీసుకొచ్చాం. వాటిలో పెనుగొండ దర్గా, బాబా షర్ఫొద్దీన్‌, యూసుఫైన్‌ బాబా దర్గా ఇలా ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా నామమాత్రమే అద్దెలు ఇచ్చే వారి లీజులను కూడా రద్దు చేస్తున్నాం. మార్కెట్‌ అద్దె ఎంత ఉంది, ఎలాంటి వ్యాపారం అక్కడ పెడుతున్నారు అన్నది అన్ని కోణాల్లో పరిశీలించి అద్దె రేటును నిర్ణయిస్తున్నాం. నామమాత్రపు అద్దె చెల్లిస్తున్న మదీన ఎడ్యుకేషన్‌ తదితర సంస్థల లీజులను రద్దు చేసి స్వాధీనం చేసుకున్నాం. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగిస్తాం. ఎక్కడా వక్ఫ్‌ బోర్డు ఆదాయానికి గండిపడకుండా చూస్తాం. లీజు కేవలం 11నెలలపాటు అన్న చట్టాన్ని వక్ఫ్‌ ఆస్తులను అద్దెకు ఇచ్చే విషయంలో పాటిస్తాం.

అతడే ఓ సైన్యం

కబ్జాదారుల పాలిట సింహస్వప్నం షేక్‌ ముహమ్మద్‌ ఇక్బాల్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖపై జరగని చర్చ ప్రస్తుతం వక్ఫ్‌ బోర్డు శాఖపై జరుగుతోంది. ఈ బోర్డు కింద ఉన్న వేలాది ఎకరాలలో కబ్జాగా ఉన్న అవినీతిపరులపై, వక్ఫ్‌ ఆస్తులను అప్పనంగా అనుభవిస్తున్న వారిపై వక్ఫ్‌బోర్డు ప్రత్యేక అధికారి షేక్‌ ముహమ్మద్‌ ఇక్బాల్‌ కొరడా రaుళిపించడమే ఇందుకు కారణం. గతంలో ఎన్నడూలేని విధంగా అతడే ఓ సైన్యంగా ముందుకు కదలి వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు నడుంకట్టిన ధీరుడు, భూకబ్జాదారులకు సింహస్వప్నంగా మారిన అధికారి షేక్‌ ముహమ్మద్‌ ఇక్బాల్‌. వక్ఫ్‌ బోర్డు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు భూకబ్జాదారులపై చర్యలు తీసుకుని వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ తనకు అల్లాప్‌ా ఇచ్చిన వరంగా భావిస్తున్న షేక్‌ ముహమ్మద్‌ ఇక్బాల్‌ గారి జీవిత నేపథ్యం సైతం నేటి అధికారులకు స్ఫూర్తిదాయకం. అంచెలంచెలుగా ఎదిగి ఐపిఎస్‌ అధికారిగా పలు జిల్లాల్లో సమర్థవంతమైన పోలీసు అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన వక్ఫ్‌ బోర్డు ప్రత్యేక అధికారిగా నియమితులైన చట్టం పక్షం నిలిచిన అధికారి ఆయన. కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్లలో 1958ఏప్రిల్‌ 26న ఆయన జన్మించారు. షేక్‌ గౌస్‌ సాహెబ్‌, షేక్‌ మహబూబ్‌బీల ఐదుగురి సంతానంలో ఇక్బాల్‌ తొలి సంతానం. తండ్రి షేక్‌ గౌస్‌ సాహెబ్‌ ఉపాధ్యాయుడు కావడం పరమత సహనం, సామరస్యంపై ఆయన ఇచ్చే బోధనలు షేక్‌ ముహమ్మద్‌ ఇక్బాల్‌లో ఎంతో స్ఫూర్తిని నింపాయి. నాలుగో తరగతి వరకు కోవెలకుంట్ల, ఆరో తరగతి బనగానపల్లె, ఆపై నందవరం, నందివర్గం, కోస్గిలలో తన అప్పర్‌ ప్రైమరీ విద్యనుపూర్తి చేశారు. ఆ తరువాత హిందూపూర్‌లో ఇంటర్‌, అధోనిలో డిగ్రీని పూర్తి చేసిన ఆయన 1978ఏప్రిల్‌ 20న అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. రెండున్నరేళ్ళ అనంతరం 1980డిసెంబర్‌లో మద్రాసులో ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ కస్టమ్స్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ అధికారిగా పనిచేశారు. 1987లో ఆంధ్రా క్యాడర్‌ డిఎస్‌పిగా నియమితులయ్యారు. అనంతరం ఆయన ఐపిఎస్‌గా పదోన్నతి సాధించారు. 1999లో డిఐజి అధికారిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం వక్ఫ్‌ బోర్డు ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్నారు. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన ఆయన వక్ఫ్‌ బోర్డు ప్రత్యేక అధికారిగా బాద్యతలు చేపట్టి ఈ శాఖలోనూ తనదైన ముద్రను వేశారు. ఎక్కడాలేని విధంగా వక్ఫ్‌ బోర్డులో ఉన్న అవినీతి తిమింగలాలు ఏరివేసే పనిలో నిమగ్నమయ్యారు. వక్ఫ్‌ బోర్డులో చక్రం తిప్పిన వ్యక్తిని సైతం ఇటీవల ఓ భూ కబ్జా విషయంలో జైలుకు పంపి చరిత్ర సృష్టించిన అధికారి ఇక్బాల్‌. పరిమితి సిబ్బందితో వక్ఫ్‌ భూ బకాసురులపై యుద్ధం చేస్తున్న ఆయన తనకు తగినంత సిబ్బందిని ప్రభుత్వం సమకూర్చితే వక్ఫ్‌బోర్డును ఆదాయం ఉన్న వనరుగా తీర్చిదిద్దుతానని, వక్ఫ్‌ బోర్డు ఆస్తులను పూర్తిగా స్వాధీనం చేసుకుంటానని షేక్‌ ముహమ్మద్‌ ఇక్బాల్‌ పేర్కొంటున్నారు.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *