మాటలే ముత్యాలు

`నాదిరా ఫిర్దోస్‌

ఖెరూన్‌ తన ఇద్దరు కూతుళ్ళతో హాయిగా జీవితం గడపసాగింది. ఖైరూన్‌, ఆమె చిన్న కుమార్తె మాలన్‌ ఆగడాలకు ఆ ఊరిలోని వారంతా విసిగిపోయేవారు. ఎందుకంటే మాలన్‌కు ఆమె తల్లి పోలికే అని, వారి నోటి దురుసుతనానికి ఊరిలో జనం హడలెత్తిపోయేవారు. ఎప్పుడైనా వారింటికి వచ్చే అతిథులు కూడా వారితో కలిసి ఉండలేకపోయేవారు. కానీ వీరికి విరుద్ధంగా ఖైరూన్‌ సవతి కూతురైన జైనబ్‌ కూడా వారితోనే ఉండేది. ఖైరూన్‌, మాలన్‌ల ప్రవృత్తికి భిన్నంగా జైనబ్‌ ప్రవర్తన ఉండేది. ఆమె ఎంతో మృదు స్వభావి. నిజాయితీ గలది. జైనబ్‌ లాంటి మంచి మహిళ ఆ ఊరిలో ఎవరూలేరు. కానీ ఖైరూన్‌ తన సొంత కూతురైన మాలన్‌నే బాగా గారాభంగా చూసుకునేది. జైనబ్‌ను మాత్రం పట్టించుకునేది కాదు. జైనబ్‌ ఎప్పుడూ ఇంటి పనులు చేసుకుంటూ ఉండేది.

ఒకరోజు ఖైరూన్‌, జైనబ్‌ను చెరువుకెళ్ళి నీరు తీసుకురమ్మని ఆజ్ఞాపించింది. దీనికి జైనబ్‌ సరేనమ్మా అని చెరువు వద్దకు నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళింది. చెరువు ఒడ్డున ఒక వృద్ధ మహిళ నీళ్ళు త్రాగడానికి చెరువులో దిగటానికి ప్రయత్నించి దిగడం రాక చెరువు ఒడ్డున కూర్చున్నది. అది గమనించిన జైనబ్‌ కూడా చెరువులో నుండి నీళ్ళు తీసుకువచ్చి వృద్ధురాలికు తాగించింది. జైనబ్‌ చేసిన సహాయానికి ఆ వృద్ధురాలు ఎంతో సంతోషపడి జైనబ్‌ను ఎంతగానో మెచ్చుకుంది. అంతేకాకుండా నేను నీకు ఒక వరమిస్తాను. దీనితో నీవు ఎప్పుడూ మాట్లాడినా ముత్యాలు, వజ్రాలు రాలుతాయని చెప్పింది. చివరికి కుండ నిండా నీళ్ళు తీసుకుని ఇంటికి వచ్చిన జైనబ్‌ను ఇంత ఆలస్యంగా వచ్చానేమని ఆమె తల్లి మందలించసాగింది. దానితో జైనబ్‌ నన్ను క్షమించమ్మా’ నేను ఆలస్యం చేసింది ఎందుకంటే అని జైనబ్‌ చెప్పగానే వజ్రాలు, ముత్యాలు నోటి నుంచి రాలసాగాయి. ఇది చూసిన ఖైరూన్‌ మొదటిసారిగా ‘ఓ బంగారు తల్లి’అని ఆశ్చర్యపోయి, గారాబంగా పిలిచింది. జైనబ్‌ నది ఒడ్డున జరిగిన సంఘటన తల్లికి వివరించింది. ఆశ్చర్యపోవడం ఖైరూన్‌ వంతయింది. ఔనా! నిజమా!! మాలన్‌ను కూడా నీళ్ళు తీసుకురావడానికి చెరువు ఒడ్డుకు పంపుతాను. ఆమె నోటి నుండి ఏమి రాలుతాయో చూడాలి.

చెప్పినట్టుగానే ఖైరూన్‌ మాలన్‌ను కూడా వెండి కుండతో చెరువు వద్దకు పంపించింది. నిజంగానే ఒక వృద్ధురాలు దాహంతో మంచినీటి కోసం ఎదురుచూస్తోంది ఎవరైనా దాహం తీరుస్తారని. తనకు కూడా ఏదైనా వరం దొరుకుతుందనే దురాశతో మాలన్‌ వెండికుండతో నీళ్ళు తీసుకుని వెళ్ళి ఆ వృద్ధ మహిళకు తాగించింది. నీ కోసం నేను వెండి కుండ నిండా నీళ్ళు తెచ్చాను. నాకు నీవు ఏమి వరమిస్తావు అని మాలన్‌ తన దురుసు స్వభావాన్ని ప్రదర్శించింది. దానితో ఆ వృద్ధురాలికు కోపం వచ్చింది. నీ ప్రవర్తనకు బదులుగా వరములు కాదు. కానీ శాపం అయితే బాగుంటుంది. ఎప్పుడైతే నీవు మాట్లాడతావో నీ నోటి నుంచి పాములు, కప్పలు, తేళ్ళు బయటికి వస్తాయి అని శపించింది. ఆ వృద్ధురాలి శాపానికి మాలన్‌ ఏడుస్తూ ఇంటికి వచ్చింది. అది గమనించిన తల్లి నీవు ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగింది. తల్లి ఎలాంటిదో కూతురు అలాంటిది అని చెప్పింది మాలన్‌. దీనితో మాలన్‌ నోటి నుంచి కప్పలు, తేళ్ళు, పాములు బయటికి వచ్చాయి. మాలన్‌ శాపానికి కారణం జైనబ్‌నే అని మూర్ఖంగా ఆలోచించి జైనబ్‌ను ఇంటి నుంచి గెంటివేసింది ఖైరూన్‌. జైనబ్‌ ఏడ్చుకుంటూ అడవి వైపు వెళ్లి ఒక చెట్టుకింద ఏడుస్తూ కూర్చుంది. అంతలో అటువైపు నుంచి వెళ్తున్న ఒక రాకుమారుడు జైనబ్‌ను చూసి ఆగి, ఆమె వద్దకు వచ్చి తన విచారానికి కారణం ఏమని అడిగాడు. ఆమె తనతో జరిగిన ఉదంతాన్ని రాకుమారుడికి వినిపించింది. జైనబ్‌ నిజాయితీని, తనలో వున్న మంచి గుణాలకు మెచ్చి జైనబ్‌ను తన రాజ్యానికి తీసుకెళ్ళి వివాహం చేసుకున్నాడు ఆ రాకుమారుడు. జైనబ్‌ జీవితం సుఖవంతమైంది. ఖైరూన్‌, మాలన్‌ ఆగడాలను ఆ ఊరివారు భరించలేక ఆ ఊరి జనమంతా కలిసి ఏకమై ఆ ఊరి నుండి ఆ ఇద్దరినీ వెలివేశారు.

Check Also

అనుమానం – స్టొరీ

‘ఓ వదినా, చిన్నీని మీ బెడ్‌ మీద పడుకోబెడుతున్నా! బిట్టూకు టిఫిన్‌ ఇచ్చి వస్తా. అయ్యో పాల సీసా మరిచిపోయా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *