రాజకీయ ప్రాతినిధ్యం దొరకని ఓటుబ్యాంకు!

Muslim_population_in_Indiaఒక అంచనా ప్రకారం దేశంలో ముస్లిముల జనాభా 22నుంచి 25కోట్ల వరకు ఉంటుంది. ప్రతి ఆరుగురు భారతీయుల్లో కనీసం ఒక ముస్లిమ్‌ ఉంటాడు. కాని 16వ లోక్‌సభలో ముస్లిముల రాజకీయ ప్రాతినిధ్యం చూస్తే అట్టడుగున కనబడుతుంది. కేవలం 21మంది మాత్రమే లోక్‌సభలో ఇప్పుడు ఉన్నారు. ఒక పార్లమెంటు నియోజకవర్గంలో సాధారణంగా 15లేదా 16లక్షల మంది ఓటర్లు ఉంటారు. అంటే ఒక పార్లమెంటు సభ్యుడు పదిహేను లేదా పదహారు లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తాడు. కాని ముస్లిముల విషయం వచ్చేసరికి కోటిమందికి ఒక్కరి ప్రాతినిధ్యం కూడా లేదు. మనది ప్రజాస్వామిక దేశం, లౌకికదేశం. ప్రతి సముదాయానికి ఓటు హక్కు ఉన్న దేశం. ఇలాంటి దేశంలో ఈ పరిస్థితిని ఏమనుకోవాలి?

ముస్లిముల రాజకీయ ప్రాతినిధ్యం ఇంత తక్కువగా ఉండడం కేవలం ముస్లిములకు మాత్రమే ఆందోళనకరమైన విషయమా? నిజానికి అనేక ఇతర వర్గాల మేధావులు కూడా ఈ సమస్య పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  మీడియాలో కూడా ఈ సమస్య చర్చకు వస్తుంది. భారత చరిత్రలో అతితక్కువ ముస్లిమ్‌ ప్రాతినిధ్యంతో ఈసారి లోక్‌సభ ప్రత్యేకత సముపార్జించుకుంది. దేశ స్వాతంత్య్రం తర్వాత ముస్లిముల రాజకీయ ప్రాతినిధ్యం ఇంత దయానీస్ధాయికి గతంలో ఎన్నడూ దిగజారలేదు. ముస్లిములు ప్రభుత్వ ఉద్యోగాల్లోను తక్కువగానే కనబడతారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, స్కీముల్లోను ప్రయోజనం పొందేవారిలో ముస్లిముల సంఖ్య చాలా తక్కువ. రాజకీయ ప్రాతినిధ్యం నామమాత్రంగా కూడా లేదు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ సమస్య ఎంత లోతయినదో మరింత స్పష్టంగా అర్ధమవుతోంది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో 80లోక్‌సభ స్ధానాలున్నాయి. అక్కడ 18శాతం ముస్లిమ్‌ జనాభా ఉంది. అయినా అక్కడి నుంచి ఒక్క ముస్లిమ్‌ అభ్యర్ధి కూడా గెలుపొందలేదు. ఈ పరిస్థితికి కారణాలేమిటి? దీనికి బాధ్యులెవరు? ఇది కేవలం ముస్లిముల సమస్యగా భావించడం పొరబాటు. దేశంలో ఒక సామాజికవర్గం రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోవడమన్నది దేశ ప్రగతి వికాసాలపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అందరూ ఆలోచించవలసిన సమస్య ఇది.

దేశంలో ముస్లిముల రాజకీయ ప్రాతినిధ్యం నానాటికి దిగజారుతోంది. అయినా పదిహేనవ లోక్‌సభలో కనీసం 29మంది ముస్లిములు ఉండేవారు. ఈసారి కేవలం 21మంది మాత్రమే లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈసారి దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచాయనుకున్నా, లేక మోడీ గాలి వీచిందనుకున్నా కూడా  కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకడం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతుంది. కాని మోడీ గాలి వీస్తుందనుకుంటే, బిజేపి తరఫున పోటీ చేసిన ఏడుగురు ముస్లిములు కూడా ఓడిపోయారు. ఎందువల్ల? వారి విషయంలో బిజేపి చెప్పుకునే సమానత్వ సూత్రం పనిచేయలేదా? బిజేపి చెప్పుకున్న మోడీ సునామీ ఈ ముస్లిమ్‌ అభ్యర్ధులను ఎందుకు గెలిపించలేకపోయింది? ఇక్కడ మోడీ సునామీ ఎందుకు ప్రభావం చూపలేదు. ముస్లిములకు తక్కువ టిక్కట్లు కేటాయించడం ఎందుకు జరుగుతోంది? టిఆర్‌యస్‌ పార్టీ చివరి నిముషంలో ముస్లిములకు టిక్కట్లిస్తే గెలవడం కష్టం కాబట్టి ఇవ్వలేనని ఎందుకు ప్రకటించింది? ఈ ప్రశ్నలన్నింటిపై ఆలోచిస్తే లోతయిన, సామాజిక రుగ్మత పనిచేస్తుందని అర్ధం కావడం లేదా? ఈ సామాజిక రుగ్మత కుట్రలు కుతంత్రాలతో ముస్లిములను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటుందని తెలియడం లేదా?

అల్పసంఖ్యాక వర్గాల ప్రగతి వికాసాల పథకాలు అమలు చేయడానికి, సచర్‌ కమిటీ సిఫారసులు అమలు చేయడానికి దేశంలో 87ముస్లిమ్‌ జనాభా అధికంగా ఉన్న జిల్లాలను గుర్తించడం జరిగింది. ఈ జిల్లాల్లోని 45లోక్‌సభ స్ధానాల్లో బిజేపికి చెందిన ముస్లిమేతర అభ్యర్ధులే గెలుపొందారు. ఒక్క ముస్లిమ్‌ అభ్యర్ధి కూడా గెలుపొందలేదు. ముస్లిముల జనాభా అధికంగా ఉన్న జిల్లాల నుంచి కూడా ముస్లిములు గెలుపొందలేని పరిస్థితికి కారణాలేమిటి?

దీనికి రాజకీయపార్టీల వైఖరి కారణమా? లేక స్వయంగా ముస్లిములే కారణమా? ఈ ప్రశ్న గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. దేశంలో ముస్లిముల జనాభా ప్రకారం చూస్తే లోక్‌సభలో వారికి కనీసం 70నుంచి 75స్ధానాలు లభించాలి. దేశంలో దాదాపు ఇన్ని లోక్‌సభ స్ధానాల్లో ముస్లిములు అధిక సంఖ్యలో  ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లో ముస్లిములు గెలుపొందే అవకాశాలున్నాయి. అయినా ప్రతిసారి ఎన్నికల్లో గెలుపొందే ముస్లిముల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. ఈసారి రాజకీయ ప్రాతినిధ్యం అట్టడుగుకు చేరింది. అతి తక్కువ సంఖ్యలో ముస్లిములు లోక్‌సభకు చేరుకున్నారు. మరో విషయమేమంటే, మెజారిటీ సాధించిన బిజేపి టిక్కట్టుపై పోటి చేసిన అతితక్కువ ముస్లిమ్‌ అభ్యర్ధుల్లో కూడా ఎవరూ గెలవలేదు. అంటే లోక్‌సభలో పాలకపక్షం వైపు ఒక్క ముస్లిమ్‌ సభ్యుడు కూడా లేడు. గెలిచిన అతితక్కువ ముస్లిమ్‌ సభ్యులు కూడా ప్రతిపక్షాల్లోనే ఉన్నారు. బిజేపికి మిత్రపక్షమైన లోక్‌జనశక్తి పార్టీ తరఫున ఒక ముస్లిమ్‌ అభ్యర్ధి గెలిచాడు. ఆ అభ్యర్ధికి స్వయంగా లోక్‌జనశక్తి పార్టీలోనే ప్రాముఖ్యత లేదు. ఇక ఎన్‌డీఏలో ప్రాముఖ్యత ఉంటుందా? ఆ విధంగా చూస్తే 16వ లోక్‌సభలో ముస్లిముల స్వరం వినిపించే అవకాశాలే లేవు.

పార్లమెంటులో ముస్లిముల రాజకీయ ప్రాతినిధ్యం తక్కువగా ఉండడమన్నది ఎప్పుడూ ఉన్న సమస్యే. ఏడవ, ఎనిమిదవ లోక్‌సభల్లో కాస్త ఎక్కువగా ముస్లిములు కనబడ్డారు. ఏడవ లోక్‌సభలో 49మంది, ఎనిమిదవ లోక్‌సభలో 46మంది ముస్లిమ్‌ సభ్యులు ఉండేవారు. మరెప్పుడు కూడా ముస్లిముల సంఖ్య లోక్‌సభలో 30కి మించలేదు. విచిత్రమేమంటే, ప్రతిసారి ఎన్నికల్లో ముస్లిముల ఓటు ప్రాముఖ్యత పై చాలా చర్చలు జరుగుతుంటాయి. ముస్లిమ్‌ ఓటుబ్యాంకు గురించి చర్చలు జరుగుతుంటాయి. ముస్లిముల ఓటుబ్యాంకు ముస్లిములను గెలిపించలేకపోవడమేమిటి? ముస్లిము రాజకీయాల గురించి చర్చలు చేసే పెద్దలు దీనికి జవాబేమిస్తారు?రాజకీయపార్టీలు కూడా ముస్లిముల ఓట్లను పొందడానికి చాలా ప్రయత్నాలు చేస్తాయి. ముస్లిమ్‌ నేతలు, ముస్లిమ్‌ సంస్థలు కూడా ముస్లిముల్లో రాజకీయ చైతన్యం సృష్టించడానికి, వారిని సమైక్యపరచడానికి అప్పీళ్ళు చేస్తుంటారు. రాజకీయ పార్టీలు ముస్లిములను ఆకట్టుకోడానికి బహిరంగ సభలు నిర్వహిస్తుంటాయి. కాని ఫలితాలు వెలువడిన తర్వాత చూస్తే ముస్లిమ్‌ అభ్యర్ధులు గెలవడం జరగదు, ముస్లిములు ఇష్టపడిన పార్టీలు కూడా గెలవడం కనబడదు. దీనికి కారణాలేమిటి?

కాస్త ఆలోచిస్తే దీనికి కారణాలు అర్ధం కానివేమీ కాదు. ఈ కారణాలు కొత్తవేమీ కాదు. మొదటి కారణం రాజకీయపార్టీలు ముస్లిములకు టిక్కట్లివ్వడానికి వెనుకాడతాయి. చాలా తక్కువ మందికి మాత్రమే టిక్కట్లిస్తాయి. టీఆర్‌యస్‌ దానికి మంచి ఉదాహరణ. మొదట పదిహేనుమందికి టిక్కట్లిస్తామని చెప్పిన కేసీఆర్‌ గెలుపు అవకాశాలు లేనందువల్ల టిక్కట్లివ్వలేనని చేతులెత్తేశాడు. రాజకీయ పార్టీలు టిక్కట్లిచ్చినా గెలిచే అవకాశాలున్న నియోజకవర్గాల్లో ఇవ్వడం లేదు. టిక్కట్లిచ్చిన ముస్లిమ్‌ అభ్యర్ధుల గెలుపు కోసం పార్టీ ప్రయత్నించడం లేదు. ఒక్కోసారి టిక్కట్టిచ్చిన ముస్లిమ్‌ అభ్యర్ధికి వ్యతిరేకంగా ఆ పార్టీ స్ధానిక నాయకులు పనిచేసిన ఉదాహరణలున్నాయి.  ముస్లిములకు టిక్కట్లివ్వడమే గొప్ప అన్నట్లు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. వారిని గెలిపించుకోవలసిన బాధ్యత ముస్లిమ్‌ ఓటర్లదే అన్నట్లు మాట్లాడతాయి. ఒక వాస్తవమేమంటే, దేశంలో సెక్యులరిజమ్‌ అన్నది కేవలం ముస్లిముల అవసరం మాత్రమే కాదు. ఇది అందరికీ అవసరం. సెక్యులర్‌ పార్టీలను గెలిపించడం అన్నది కేవలం ముస్లిముల బాధ్యత కాదు. ఇది అందరి బాధ్యత. మరో కారణమేమంటే, ముస్లిముల జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో అనేకమంది ముస్లిమ్‌ అభ్యర్ధులు వివిధ పార్టీల తరఫున నిలబడడం, కొన్ని చోట్ల ఇండిపెండెంట్‌ అభ్యర్ధులు రంగంలోకి దిగడం లేదా దించడం ద్వారా ముస్లిముల ఓట్లు చీలిపోయేలా చేస్తున్నారు. ఫలితంగా ముస్లిమేతర అభ్యర్ధి గెలవడానికి అవకాశాలు మెరుగవుతున్నాయి.

సాధారణంగా పార్టీలు ముస్లిములకు టిక్కట్లిచ్చినా ముస్లిమ్‌ జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఇస్తున్నాయి. ముస్లిములు గెలుపొందకుండా చూడాలనుకుంటున్న వారు అనేక ఎత్తుగడలతో ఈ నియోజకవర్గాల్లో ముస్లిముల ఓట్లను చీల్చుతున్నారు. కొందరు ముస్లిము అభ్యర్ధులను ప్రలోభాలతో తమ పక్షానికి తిప్పుకుని వారి ద్వారా ఓట్లు చీలేలా చేస్తున్నారు. వారిని కూడా ఎన్నికల్లో నిలబడేలా ` ఏదో ఒక పార్టీ తరఫున లేదా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీలోకి దించి ఓట్లు చీల్చుతున్నారు. ఇలాంటి అభ్యర్ధులకు నిధులు సమకూర్చడం, ప్రచారం చేసి పెట్టడం కూడా జరుగుతుంది. ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతుందంటే తప్పులేదు. ముస్లిములు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇలా ముస్లిముల ఓట్లను చీల్చడానికి నిలబడే ముస్లిమ్‌ అభ్యర్ధులు చాలా మంది కనబడుతున్నారు. రాజకీయ చైతన్యం లోపించిన సాధారణ ముస్లిములు ఈ ఎత్తుగడలను అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఒక్కో ఓటుకు ప్రాముఖ్యం ఉండే ఎన్నికల్లో ముస్లిము ప్రయోజనాల కోసం నిజాయితీగా ఎన్నికల్లో నిలబడిన ముస్లిములు ఓటమి పాలవుతున్నారు. ముస్లిములు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో నలుగురైదుగురు ముస్లిమ్‌ అభ్యర్ధులు నిలబడడం, చివరకు ఒక్క ముస్లిము అభ్యర్ధి కూడా గెలుపొందని ఫలితాలు రావడం ఒక కాదనలేని చేదునిజం. ఈసారి ఎన్నికల్లోనూ అదే జరిగింది. ముస్లిముల  ఓట్లు చీలిపోయాయి. ఈ రాజకీయ ఎత్తుగడలను అర్ధం చేసుకోవడంలో ముస్లిములు విఫలమవుతున్నారు. ముస్లిముల్లో రాజకీయ చైతన్యం సృష్టించే ప్రయత్నాలు కూడా కేవలం అప్పీళ్ళకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ఈ కారణాలపై దృష్టి పెట్టి తగిన పరిష్కార ప్రయత్నాలు చేయనట్లయితే ముస్లిముల రాజకీయ ప్రాతినిధ్యం పెరిగే అవకాశం లేదు.

Check Also

geeturai_weekly_magazine_18_1

సదాచరణ

మనం మంచిగా ఎలా వ్యవహరించాలి? సేవలకు అర్హులైనవారెవరు? అనే విషయాలు ఇస్లాం చాలా స్పష్టంగా తెలియజేసింది. మనిషికి తన తల్లిదండ్రులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *