వర్తమాన పరిస్థితుల్లో ` మేరాజ్‌ యాత్ర సందేశం

` హాఫిజ్‌ ముహమ్మద్‌ ఖాసిం షర్ఫీ, ఎం.ఎ., ఎంఈడీ

మహాప్రవక్త ముహమ్మద్‌(స) గారి జీవితంలోని ప్రతి సంఘటన, ప్రతి కోణం అద్భుతమైనది, ఆదర్శవంతమైనది. అందులో ముస్లిం సమాజానికి గొప్ప సందేశం ఇమిడి వుంది. గని ఆ రత్నాలను, ఆ వజ్ర వైఢూర్యాలను గ్రహించే స్పృహ కలిగిన హృదయం, నీతిదాయకమైన మనస్సు కావాలి.

మహాప్రవక్త(స) గారి జీవితంలో జరిగిన అత్యంత గొప్ప సంఘటన మేరాజ్‌ సంఘటన. ఇది సాధారణమైన సంఘటనల కన్నా భిన్నమైనది. గొప్ప మహత్మ్యాన్ని కలిగివున్నది. ఈ సంఘటన కొన్ని బేధాభిప్రాయాల ద్వారా రజబ్‌ నెలలోనే సంభవించిందని చెప్పడం జరుగుతుంది. వర్తమాన పరిస్థితుల్లో ముస్లిం సమాజం ఈ సంఘటన ద్వారా ఎంతో శక్తిని, దైర్యాన్ని పొందవచ్చు. నేడు ప్రపంచంలో ముస్లిం సమాజ పరిస్థితి విచ్చిన్నమై, నిరాశకు లోనై ఉన్నది. ముస్లిం వ్యతిరేక శక్తుల దాడుల ద్వారా, ప్రాపంచిక కుట్రల ద్వారా మొత్తం ముస్లిం ప్రపంచం నిరాశా, నిస్పృహకు లోనై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అనుకూల ప్రక్రియ కన్నా ముందు వారిని నిరాశ, నిస్పృహల ఊబి నుంచి బయటికి తీసుకురావాలి. ఇదే మేరాజ్‌ సంఘటన మూల సందేశం. కష్టాలను, ఆపదలను, విపత్తులను చూసి నిరాశ చెందకూడదు. ఇంకా వాటి నుంచి కొత్తశక్తిని కొత్త ధైర్యాన్ని, కొత్త సంకల్పాన్ని పొందాలి. ఎందుకంటే ప్రతి రాత్రి చీకటిని చీల్చుకుంటూ ఉదయించడం జరుగుతుంది. ప్రతి కష్టం తర్వాత సుఖమయ సందర్భముంటుంది. మేరాజ్‌ అంటే అరబీ భాషలో ‘నిచ్చెన’, ‘అధిరోహించడం’ అని అర్థం. మేరాజ్‌ ద్వారా మహాప్రవక్త ముహమ్మద్‌(స) గారికి అత్యున్నతమైన గొప్ప స్థానాన్ని కల్పించడం జరిగింది. ఇలాంటి గొప్ప స్థానం మహాప్రవక్త(స) తప్ప మరెవరికి లభించలేదు. ఈ గొప్ప స్థానం దైవప్రవక్త(స) గారికి ఇట్టే లభించలేదు. దీనివెనుక కఠోరమైన శ్రమ వుంది. కఠినమైన పరిస్థితులను, సమస్యలను ఎదుర్కొవాల్సి వచ్చింది. మేరాజ్‌యాత్ర కన్నా ముందు పరిస్థితులను గమనించినట్లయితే మక్కావాసుల వ్యతిరేకత చివరి ఘట్టానికి చేరుకుంది. సత్యవ్యతిరేకులు ఆయన ప్రచార మార్గంలో ఎన్నో అవరోధాలు సృష్టించారు. తనపై విశ్వసించిన కొద్దిమంది అనుయాయులు అనేక కఠినమైన శిక్షలుభరించారు. అన్యాయాలను ఎదుర్కొన్నారు. తనకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ, అన్నివిధాల ప్రోత్సాహాన్ని ఇచ్చిమద్దతునిచ్చే తన పిన తండ్రి అబూతాలిబ్‌, తన భార్యామణి ఖదీజా (రజి) ఇద్దరూ ఒకరి తర్వాత మరొకరు మరణించడం జరిగింది. దీనిద్వారా మక్కావాసులు, సత్య వ్యతిరేక వర్గం ప్రవక్త(స)పై భౌతిక దాడులు ప్రారంభించారు. అప్పుడు మహాప్రవక్త(స) గారు తాయిఫ్‌ పట్టణం వెళ్ళి ఇస్లాం ప్రచారం చేయాలనుకున్నారు. కనీసం అక్కడైనా ఇస్లాం వ్యాప్తికి మార్గం సుగమం అవుతుందని భావించారు. కాని తాయిఫ్‌ వారు కూడా ప్రవక్త(స) గారి మాటను తిరస్కరించి, అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా అక్కడి ఆకతాయి యువకులను ఉత్తేజపరిచి ప్రవక్త(స) పై భౌతిక దాడి చేయించారు. ప్రవక్త(స) గారి పవిత్ర దేహం రక్తంతో తడిసిపోయింది. ఇలాంటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో అల్లాప్‌ా అనుగ్రహాన్ని ప్రసాదించి తన ప్రియప్రవక్త(స) గారికి మేరాజ్‌ యాత్ర శుభవార్తను వినిపించాడు.

ఒకరోజు మహాప్రవక్త(స) కాబా గృహ ప్రాంగణంలో మగత నిద్రలో ఉన్నారు. అకస్మాత్తుగా హజ్రత్‌ జిబ్రయీల్‌(అలై) వచ్చి మహాప్రవక్త(స)ను నిద్రలేపి ‘జమ్‌జమ్‌’ బావి దగ్గరకు తీసుకుపోయి అక్కడ ఆయన గుండెను ‘జమ్‌జమ్‌’ జలంతో శుభ్రపరిచి, విశ్వాసం, వివేచనలతో నింపారు. తరువాత ‘బుర్రాఖ్‌’పై కాబాగృహం నుండి బైతుల్‌ మఖ్‌దిస్‌ (జెరూసలెం మసీదు) చేరుకున్నారు. అక్కడ ఆది నుంచి అంతం వరకు ఆవిర్భవించిన దైవప్రవక్తలంతా సమావేశమై ఉన్నారు. వారు మహాప్రవక్త(స) ను చూడగానే బారులుతీరి నిలబడ్డారు. ఇమామత్‌ (నాయకత్వం) ఎవరు వహిస్తారో అని అందరు నిరీక్షించగా దైవదూత జిబ్రయీల్‌(అలై) మహాప్రవక్త ముహమ్మద్‌(స)ను ఇమామత్‌ చేయాల్సిందిగా కోరారు. ప్రవక్త(స) నేతృత్వంలో అందరూ నమాజ్‌ చేశారు. తరువాత మహాప్రవక్త(స) దగ్గరకు ఒక నిచ్చెన తీసుకురాబడిరది. దైవదూత హజ్రత్‌ జిబ్రాయీల్‌(అ) ఆ నిచ్చెన ద్వారా మహాప్రవక్త(స)ను గగనానికి తీసుకుని వెళ్ళారు.

మహాప్రవక్త (స) మొదటి ఆకాశానికి చేరుకున్నారు. అప్పుడు ఆకాశద్వారాలు మూసివున్నాయి. ద్వార పాలకులు హజ్రత్‌ జిబ్రాయీల్‌(అ)ని ఉద్దేశించి, ‘మీతోపాటు వచ్చిన వ్యక్తి ఎవరు?’ అని అడిగారు. దానికి ఆయన ‘ముహమ్మద్‌(స)’ అని బదులిచ్చారు. ఆయన్ని పిలిపించడం జరిగిందా? అని అడిగారు ద్వారపాలకులు. మళ్ళీ ‘అవును’ అన్నారు జిబ్రాయీల్‌(అలై). అప్పుడు ఆకాశ ద్వారాలు తెరువబడ్డాయి. మొదటి ఆకాశంలోని దైవదూతలు మహాప్రవక్త(స)ను సాదరంగా ఆహ్వానిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ ఆయన(స)కు ఉన్నత హోదా అంతస్తులు కలిగిన అనేకమంది వ్యక్తులతో పరిచయమైంది. వారు సంపూర్ణ మానవ రూపం, దేదీప్యమైన ముఖ వర్చస్సు కలిగివున్నారు. వారిలో ఒకరిని పరిచయం చేస్తూ జిబ్రాయీల్‌(అలై) ఈయన హజ్రత్‌ ఆదమ్‌ మానవజాతికి మూల పురుషుడు అని అన్నారు. రెండవ ఆకాశంలో హజ్రత్‌ యప్‌ాయా(అ), హజ్రత్‌ ఈసా(అలై)లతో హజ్రత్‌ జిబ్రాయీల్‌(అలై) ప్రవక్త(స) గారిని పరిచయం చేయించారు. మూడవ ఆకాశంలో తారల నడుమ పున్నమి చంద్రుడిలా అసామాన్య సౌందర్యవంతుడైన ఒక యువకుడు పరిచయమయ్యాడు. ఆయన హజ్రత్‌ యూసుఫ్‌ (అలై) అని జిబ్రయీల్‌(అలై) తెలియజేశారు. హజ్రత్‌ ముహమ్మద్‌(స) నాలుగవ ఆకాశంలో ఇద్రీస్‌ (అలై)ను, అయిదవ ఆకాశంలో హారూన్‌ (అలై)ను,ఆరవ ఆకాశంలో మూసా(అలై)ను కలిశారు. ఏడవ ఆకాశంలో అద్భుతమైన ఒక భవనం కన్పించింది. దాని పేరు బైతుల్‌ మామూర్‌. ఆ భవనం దగ్గర ముహమ్మద్‌(స)కు తనను పోలిన ఒక మహనీయుడితో పరిచయమైంది. ఆయన ప్రముఖ దైవప్రవక్త హజ్రత్‌ ఇబ్రాహీం(అలై) అని తెలిసింది.

మహాప్రవక్త(స) ఇలా పైపైకి వెడుతూ చివరికి సిద్రతుల్‌ మున్తహా అనేచోటికి చేరుకున్నారు. దైవదూత జిబ్రయీల్‌(అలై) సిద్రతుల్‌ మున్తహా వద్ద ఆగిపోయారు. అక్కడి నుండి మహాప్రవక్త(స) ఒంటరిగా ముందుకు సాగారు. చివరికి ఆయన ఒక ఎత్తయిన చదునైన ప్రదేశంలోకి ప్రవేశించగానే విశ్వసామ్రాట్టు కొలువు దర్శనమైంది. విశ్వప్రభువుతో సంభాషించే మహా భాగ్యం కూడా లభించింది. విశ్వసామ్రాట్టు జారీ చేసిన ఉత్తర్వులలో కొన్నిముఖ్యమైనవి : 1) ప్రతిరోజు యాభై సార్లు విధిగా నమాజు చేయాలి. 2) బఖరా సూరాలోని చివరి రెండు ఆయత్‌లు బోధించబడ్డాయి. 3) షిర్క్‌ (బహుదైవారాధన) తప్ప ఇతర పాపాలన్నీ క్షమించబడే అవకాశముందని తెలియజేయబడిరది. 4) ఒక మనిషి ఒక సత్కార్యం చేయ సంకల్పించుకుంటే అతని కర్మ పత్రంలో ఒక పుణ్యం రాయబడుతుంది.

అతనా సత్కార్యాన్ని ఆచరణలో పెడితే అతని కర్మపత్రంలో పది పుణ్యాలు రాయబడతాయి. అయితే ఒక మనిషి ఒక దుష్కార్యం చేయదలుచుకున్నప్పుడు అతని కర్మపత్రంలో ఏదీ రాయడం జరగదు. ఒకవేళ అతనా దుష్కార్యాన్ని ఆచరణలో పెడితే అతని కర్మపత్రంలో ఒకే దుష్కార్యం (పాపం) రాయబడుతుంది.

మహాప్రవక్త ముహమ్మద్‌(స) దైవసన్నిధి నుండి తిరుగు ప్రయాణమయ్యేటప్పుడు హజ్రత్‌ మూసా ప్రవక్త(అలై) కలిశారు. మూసా(అలై) మహాప్రవక్త(స)కు ఇవ్వబడిన దైవాజ్ఞలు విని నమాజు విషయంలో దైవ సన్నిధికి వెళ్ళి నమాజులు తగ్గింపు కోసం విశ్వప్రభువును విన్నవించుకోమన్నారు. దైవప్రవక్త (స) అల్లాప్‌ా సన్నిధికి వెళ్ళి నమాజ్‌ల తగ్గింపు కోసం అర్థించారు. చివరికి ఐదు నమాజులు విధిగా నిర్ణయించబడిరది. ఈ ఐదుపూటల నమాజు యాభై పూటల నమాజు సమానమని చెప్పబడిరది.

తిరుగు ప్రయాణంలో మహాప్రవక్త(స) నిచ్చెన ద్వారానే దిగి బైతుల్‌ మఖదిస్‌కు చేరుకున్నారు. అక్కడి దైవప్రవక్తలంతా హాజరై ఉన్నారు. మహాప్రవక్త(స) నేతృత్వంలో అందరూ నమాజ్‌ చేశారు. బహుశా అది ఫజ్ర్‌నమాజ్‌ వేళ అయి వుండవచ్చు. అనంతరం మహాప్రవక్త(స) ‘బుర్రాఖ్‌’ ఎక్కి మక్కా తిరిగి వచ్చారు.

ఆ యాత్ర నుంచి తిరిగొచ్చిన తర్వాత దైవప్రవక్త(స) అందజేసిన సందేశం ఖుర్‌ఆన్‌లోని 17వ అధ్యాయంలోని ‘బనీ ఇస్రాయీల్‌’లో ప్రతి అక్షరం ఈనాటికీ సురక్షితంగా ఉంది. ఈ అధ్యాయ అధ్యయనం చేస్తూ దీని చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇస్లామీయ శాసనాలు, సూత్రాల ప్రాతిపదికన ఓ నూతన రాజ్యానికి రూపకల్పన చేసేముందు దైవప్రవక్త, ఆయన అనుయాయులు మున్ముందు చేయవలసిన కార్యాలను గురించి హితోపదేశాలు చేయబడుతున్నాయని మనకు స్పష్టంగా అర్థమైపోతుంది.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *