వేసవి ఫలాలు

సల్మాన్‌ హైదర్‌

వేసవి వచ్చేసింది. భానుడు తన వేడిమి తీవ్రతను చూపించడం ప్రారంభించాడు. సీజన్‌లో వచ్చే ఫలాలని, వాటి రసాలని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు.

పళ్ళల్లో అనేక విటమిన్లు, మాంసకృత్తులు సమృద్ధిగా ఉండటమేకాకుండా పిండిపదార్థాలు 5నుంచి 20శాతం వరకు ఉంటాయి. పైగా గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌లు సమపాళ్ళలో ఉండటం, ఆర్గానిక్‌ ఆమ్లాలు అధికంగా ఉండడం వల్ల వేసవి తాపం కారణంగా శక్తి నశించిన వారికి వెంటనే చక్కటి ఉపశమనాన్ని ఇస్తాయి.

రక్తంలో పేరుకుపోయే కొవ్వుని తగ్గించడమే కాకుండా గుండెపోటుని తగ్గించే రసాయనాలు ఫలాలలో ఉన్నాయి. క్యాన్సర్‌  కారకాలను తగ్గించడంలో ఫలాలు ముందుంటాయి. చర్మం ఆరోగ్యవంతంగా తయారుకావటానికి.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు పండ్లు ఉపయోగపడతాయి. వేసవిలో వడదెబ్బ, డీహైడ్రేషన్‌, అతిసారం తదితర వ్యాధుల నుంచి రక్షించుకునేందుకు పండ్లు ఉపయోగపడతాయి. శరీరంలోని పొటాషియం, సోడియం తదితర రసాయనాలను నేరుగా రక్తంలో కలిసేలాచేస్తాయి పళ్ళు. మధుమేహంతో బాధపడేవారు సైతం పళ్ళని తీసుకుంటే మంచిది. జ్యూస్‌లకన్నా పండ్లను బాగా కడిగి నేరుగా తింటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

ప్రకృతిలో మనకు అనేక రకాల మధుర ఫలాలు ఉన్నాయి. దాదాపుగా ఇవన్నీ మనకు ఎక్కువగా లభించే కాలం వేసవికాలమే.

వేసవి కాలంలో లభించే ఫలాలు వాటి ఉపయోగాలు

అరటిపండు : జీర్ణశక్తిని పెంచుతుంది. బాగా పండిన అరటి పళ్ళని చిన్నారులకు తినిపిస్తే జీర్ణశక్తి పెరుగటమేకాక మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఐరన్‌, పోటాషియం కలిగి దేహాన్ని రోజంతా చురుకుగా ఉంచుతుంది.

రేగు పళ్ళు : వీటిలో ఉండే టార్జానిక్‌ ఆమ్లం మానవ శరీరానికి ఎంతో మేలు చేకూర్చుతుంది.

నిమ్మ : నిమ్మ, పైనాఫిల్‌, టమోటాలో దొరికే సిట్రిక్‌ ఆమ్లం ఆరోగ్యానికి మంచిది. నీరు, నిమ్మ రసం, ఉప్పులేదా పంచదారతో కలిపి తయారు చేసిన జ్యూస్‌ తాగితే వేసవిలో దాహం తగ్గుతుంది.

ఖర్జూరం : ఖర్జూరం తీసుకుంటే సత్వరం శక్తి అందుతుంది. కనుక దానిని వేసవిలో విరివిరిగా తీసుకోవడం ఉత్తమంగా వైద్యులు చెప్తారు.

పుచ్చకాయ : పుచ్చకాయ ముక్కలు నాలుగు తింటే కడుపులో చల్లగా, హాయిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. శరీరానికి కావలసిన పోషక పదార్థాలను అందిస్తుంది. గుండె పనితీరు, రక్త ప్రసరణను మెరుగుపరచడంతోపాటు డయాబెటిస్‌తో బాధపడేవారికి మేలు చేస్తుంది. మరో విషయం… చర్మ సంరక్షణకి దీని గుజ్జు భలేగా పనిచేస్తుంది. రుచిగా ఉండి దాహాన్ని తీర్చడమే కాకుండా అనేక వ్యాధుల నివారణకి ఉపయోగపడుతుంది.

బొప్పాయి : బొప్పాయి ముక్కలు తింటే కడుపు నిండుతుంది. దాహార్తిని అరికడుతుంది. బొప్పాయిలో కైమోపపైస్‌, పపైన్‌ ఉంది. జీర్ణక్రియకు,ప్రోటీన్ల అరుగుదలకు తోడ్పడుతుంది.

మామిడి : వేసవిలో ఎక్కువగా వచ్చేవి ఈ పండ్లే. పండ్లలో రారాజు మామిడి. మధుర ఫలం మామిడి. మామిడిలో సిలినియం, ఐరన్‌ అధికంగా ఉంటుంది. పండ్లుగా తినడమేకాదు, ఎన్నో రుచికరమైన పదార్థాలు కూడా చేసుకోవచ్చు. మామిడిపండ్ల గుజ్జుతో ఐస్‌క్రీములు, కేక్‌లు, ఫ్రూట్‌సలాడ్‌… మామిడికాయతో చేసే పచ్చళ్ళు మాగాయి, ఆవకాయ, ముక్కల పచ్చడి… ఇలా ఎన్నో రకాలు చేసుకోవచ్చు.

తాటిముంజెలు : ఇవి వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేత కొబ్బరిలా ఉండే తాటిముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ద్రాక్ష : ఉదర సంబంధిత క్యాన్సర్‌, గర్భిణీలలో రక్తహీనత, కీళ్ళనొప్పులు, మూత్ర పిండాలలో రాళ్ళు తయారయ్యేవారూ, తెల్లద్రాక్ష పళ్ళను ప్రతిరోజూ తీసుకుంటూ వుండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కొబ్బరి బొండం : కొబ్బరి నీళ్ళలో అనేక పోషకాలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరిచేరవు. కొబ్బరినీళ్ళలో గ్లూకోజ్‌ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది.

నారింజ : నారింజ పండు ఎంతో ఉత్తమమైన ఫలం. నారింజలో విటమిన్లు, లవణాలు, ఎక్కువగా విటమిన్‌`ఎ, బి స్వల్పంగా, విటమిన్‌`సి ఎక్కువగా ఉంటాయి. కాల్షియం ఈ పండులో ఎక్కువగా ఉంటుంది. నారింజ సులభంగా జీర్ణమవుతుంది. నారింజను వాడితే అజీర్ణవ్యాధి తగ్గిపోతుంది. మలబద్ధకం పోతుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. మూత్రాన్ని సరళంగా జారీ చేస్తుంది.

ఆలు బుకార : ఈపండ్లు అధికమైన గుజ్జును (పీచు పదార్థం)ను కలిగి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. దీనిలో ఉండే విటమిన్‌ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచి అంటువ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

లిచి : వేసవి కాలంలో శరీరానికి కావలసిన అన్నిరకాల విటమిన్లు, ప్రోటీన్లు, సిట్రిక్‌ ఆసిడ్‌, కొవ్వు, ఇనుము, ఫాస్పరస్‌ అందిస్తుంది.

అంజీరా (ఫిగ్స్‌) : దీనిలో పొటాషియం అధికంగా ఉండటం వలన శరీరారోగ్యాన్ని కాపాడుతుంది.

జామకాయ : దీనిని పేదవారి ఆపిల్‌ అంటారు. దీనిలో విటమిన్‌ సి అధికంగా ఉంది. విరేచనాలు, రక్త విరోచనాలు, దగ్గు, జలుబు తగ్గిస్తుంది. తక్కువ కాలరీలను, ఫాట్‌, సోడియంను కలిగివుంటుంది.

ఖర్బూజ : ఖర్బూజ నీటిని అధికంగా కలిగి అధిక తీపిని కలిగివుంటుంది. వేసవి కాలంలో అధికంగా తింటారు. విటమిన్‌`ఎ, విటమిన్‌`సి, జింక్‌, పొటాషియంలను కలిగివుంది. కర్బూజ ముక్కలు తింటే కడుపు నిండుతుంది. దాహార్తిని అరికట్టవచ్చు.

పైనాఫిల్‌ : పైనాఫిల్‌లో బ్రోమిలియన్‌ ఎంజైమ్‌ అధికంగా ఉంది. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్ల అరుగుదలకు తోడ్పడుతుంది. ఆంటీ ఇన్ల్ఫమేటరీగా పనిచేస్తుంది.

సపోట : సపోటాలో సమృద్ధిగా లభించే ప్రక్టోస్‌ శరీరం త్వరగా శక్తి పుంజుకునేలా చేస్తుంది. ఈ పండు గుజ్జులో అధికంగా లభించే పీచు, పై పొట్టులో ఉండే కెరోటిన్లు మల విసర్జన సాఫీగా జరిగేలా చూస్తాయి. సపోటా పండ్లలో మాంసకృత్తులు, కెరోటిన్లు, నియాసిస్‌, పిండి పదార్థాలు, ఇనుము, సి విటమిన్‌, కొవ్వు, పీచు, థయామిస్‌, కాల్షియం, రైబోప్లేవిన్లు, శక్తి, ప్రక్టోస్‌ షుగర్లు ఎక్కువగా లభిస్తాయి. ఈ పండ్లు పాలిఫినోలిక్‌ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ పారాసిటిక్‌ సుగుణాలను మెండుగా కలిగి ఉన్నాయి. సపోటాలోని విటమిన్‌`ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. విటమిన్‌`సి శరీరంలోని హానికర ఫ్రీరాడికల్‌స్‌ను తొలగిస్తుంది. తాజా పండులోని పొటాషియం, రాగి, ఇనుము లాంటి పోషకాలు… ఫొలేట్‌, నియాసిస్‌, పాంథోయినిక్‌ ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *