శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలు

ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ పార్టీ అల్పసంఖ్యాకవర్గాల ఓట్లు ఎలా రాబట్టుకోవాలా అని ఆలోచిస్తుంటారు. మైనారిటీ ఓట్లకు గాలం వేయని పార్టీ అంటూ ఏదీ లేదు. లోక్‌సభలో దాదాపు 400నియోజకవర్గాల్లో మైనారిటీ ఓట్లు కీలక మవుతాయి. మైనారిటీ ఓట్ల వల్ల అభ్యర్ధి గెలవలేకపోవచ్చు కాని, ఒక అభ్యర్ధిని ఓడిరచడానికి మైనారిటీ ఓట్లు కారణమయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల ప్రతి పార్టీ మైనారిటీలకు వివిధ వాగ్దానాలు చేసి వారి ఓట్లు పొందడానికి ప్రయత్నిస్తుంది. కాని విచిత్రమేమంటే ఈ పార్టీలన్నింటికి మైనారిటీల ఓట్లు కావాలి, కాని మైనారిటీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడానికి, వారికి తగిన సంఖ్యలో సీట్లు కేటాయించడానికి మాత్రం ఎవరూ సిద్ధంగా లేరు.

మనది ప్రజాస్వామ్య, లౌకిక వ్యవస్థ. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించింది. కాని ఇవన్నీ కేవలం కాగితాల గడపలు దాటి ఆచరణల క్షేత్రంలో అడుగుపెట్టినట్లు కనబడడం లేదు. వివక్ష, పక్షపాతాలు ఎక్కడ చూసినా కనబడుతున్నాయి. దేశంలో ముస్లిముల పరిస్థితి చూస్తే ఈ వాస్తవం స్పష్టంగా అర్ధమవుతుంది. రాజకీయ ప్రాతినిధ్యం చూస్తే ఈ వాస్తవం మరింత స్పష్టంగా అర్ధమవుతుంది. ముస్లిములకు రాజకీయ ప్రాతినిధ్యమూ లభించడము లేదు,  ప్రభుత్వంలో వారి పాత్ర కనబడడం లేదు. ప్రభుత్వ నిర్ణయాల్లో వారి ప్రమేయం ఉండదు. సంక్షేమ పథకాల విషయంలో వారికి న్యాయంగా లభించవలసిన వాటా లభించడం లేదు. విచిత్రమేమంటే ముస్లిములను బుజ్జగిస్తున్నారన్న గగ్గోలు మాత్రం పూర్తి దేశంలో భీకర స్థాయిలో వినిపిస్తుంది. ముస్లిముల పట్ల పార్టీలు నిజంగానే బుజ్జగింపు వైఖరి ప్రదర్శిస్తుంటే, వారికి నిజంగానే దోచి పెడుతుంటే సచర్‌ కమిటి, రంగనాథ్‌ మిశ్రా కమిషన్ల నివేదికల్లో వారి పరిస్థితి ఇంత దయానీయంగా ఎందుకుంది?

ముస్లిముల విషయంలో న్యాయంగా వారికి లభించవలసిన హక్కులు కూడా లభించడం లేదన్నది స్పష్టం. అయినా కొన్ని శక్తులు దేశవ్యాప్తంగా ముస్లిములను బుజ్జగిస్తున్నారన్న గగ్గోలు చేస్తూనే ఉన్నాయి.

ఎన్నికలు వస్తే ప్రతి ఒక్క పార్టీ, మతతత్వంతో ముస్లిములకు రిజర్వేషన్లు నిరాకరించిన పార్టీలు,  కేంద్రప్రభుత్వం విడుదల చేసిన స్కాలర్‌ షిప్పులు కూడా వారికి ఇవ్వని వారు కూడా ముస్లిముల ఓట్ల కోసం గాలమేస్తూ కనబడతారు. కాని పార్లమెంటులో, అసెంబ్లీలో ముస్లిముల ప్రాతినిధ్యం విషయంలో మాత్రం ఎవరూ నోరు విప్పరు. అందువల్లనే చట్టసభల్లో ముస్లిముల జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఎన్నడూ కనబడదు. ప్రభుత్వంలో, మంత్రివర్గంలో షో కేసులో బొమ్మల్లా ఒకటి రెండు ముస్లిమ్‌ ముఖాలు కనబడుతుంటాయి. ప్రతి పార్టీలోను ఇలాంటి షోకేసు బొమ్మల్లాంటి ముఖాలు ఒకటి అరా ఉంటాయి. వీళ్ళు తమ పార్టీ గుణగణాల్లో నిమగ్నమై ఉంటారే తప్ప ముస్లిమ్‌ సముదాయం కోసం చేసేది ఏదీ ఉండదు. ఒకటి అరా ముస్లిమ్‌ ముఖాలను షోకేసుల్లో ప్రదర్శించడం ద్వారా ముస్లిములకు ప్రాతినిధ్యం ఇచ్చామని చెప్పుకోవడమే తప్ప ఇందులో చిత్తశుద్ధి ఎక్కడా లేదు. నిజం చెప్పాలంటే రాజకీయాల్లో ముస్లిముల ప్రాతినిధ్యం నామమాత్రంగా మారింది. ప్రభుత్వంలో కూడా వారి ప్రాతినిధ్యం నామమాత్రమే. అందువల్ల ప్రభుత్వ నిర్ణయాల్లో వారి ప్రమేయం శూన్యంతో సమానం. అందువల్లనే ముస్లిముల సమస్యలు నేడు మహాపర్వతాల స్థాయికి చేరుకున్నాయి. వారి వెనుకబాటుతనం సచర్‌ కమిటీ నివేదికలో స్పష్టంగా కనబడుతోంది. దళితుల కన్నా వెనుకబడిన వర్గంగా మారిపోయారు.

నేడు ముస్లిములు ఎదుర్కుంటున్న పరిస్థితులు, రాజకీయంగా వారికి ఎదురవుతున్న సవాళ్ళు గమనిస్తే, దేశం స్వతంత్రం పొందినప్పుడు దళితులు ఇతర బడుగువర్గాల ప్రజలు అప్పట్లో ఇదే పరిస్థితిలో ఉండేవారన్నది తెలుస్తుంది. వారి సమస్యల పరిష్కారానికి తగిన రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. వారికి రాజకీయ రిజర్వేషన్లు కల్పించి రిజర్వుడు నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది. ఆ నియోజకవర్గాల్లో కేవలం దళితులు, బడుగువర్గాలు, ఎవరికైతే రిజర్వు చేయబడ్డాయో వారు మాత్రమే పోటీ చేయగలరు. అంతేకాదు, కాలక్రమేణా జనాభా ప్రాతిపదికన రిజర్వుడు నియోజకవర్గాలను పెంచడం కూడా జరిగింది.

కాని ముస్లిముల వెనుకబాటుతనం దూరం చేయడానికి ఇలాంటి ఫార్మూలా అమలు చేయడం జరగలేదు. దీనిపై చాలా సార్లు డిమాండ్లు వచ్చినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫలితంగా అన్ని రంగాల్లోను, ముఖ్యంగా రాజకీయాల్లో ముస్లిములు చాలా వెనుకబడ్డారు. పార్లమెంటు, అసెంబ్లీల్లో వారి ప్రాతినిధ్యం దిగజారుతూ పోయింది. దేశంలో ముస్లిముల జనాభా, పార్లమెంటులో ముస్లిముల ప్రాతినిధ్యంతో పోల్చితే రాజకీయంగా వారెంత వెనుకబడి ఉన్నారో తెలుస్తుంది.

దీనికి ముఖ్యమైన కారణమేమంటే, రాజకీయపార్టీలు ముస్లిములకు టిక్కట్లు ఇవ్వడానికి వెనుకాడతాయి. ముస్లిముల జనాభా ప్రకారం వారికి ఏ ఒక్క పార్టీ కూడా టిక్కట్లు కేటాయించదు. మరీ విచిత్రమేమంటే, టిక్కట్ల పంపిణీలో వివిధ కులాల జనాభా, ఓట్ల ప్రాముఖ్యం వగైరాలు దృష్టిలో ఉంచుకుని టిక్కట్లు ఇస్తారు, కాని ముస్లిముల విషయంలో మాత్రం అలా చేయరు. బిజేపి సమానత్వం గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతుంది కాని ఆచరణలో ముస్లిములకు అతితక్కువ టిక్కట్లు మాత్రమే ఇస్తుంది. మిగిలిన పార్టీల పరిస్థితి కూడా కొద్దో గొప్పో అటూ యిటుగా ఇలాగే ఉంది. ఇతర కులాలు, వర్గాలకు మాత్రం వారి ఓట్ల బలాన్ని బట్టి టిక్కట్లు కేటాయిస్తుంటారు. టిఆర్‌యస్‌ ఎన్నికలకు ముందు, తెలంగాణా ఉద్యమం సందర్భంగా ముస్లిములకు ఇస్తానని వాగ్దానం చేసిన సీట్లు ఇవ్వలేదు. నిజానికి తెలంగాణా ఉద్యమంలో టిఆర్‌యస్‌తో పాటు ముస్లిములు చాలా కీలకపాత్ర పోషించారు. కాని కేసీఆర్‌ ముస్లిములకు టిక్కట్లు ఇవ్వడానికి వెనుకాడారు. ముస్లిముల సంక్షేమానికి చాలా చేస్తానన్న పెద్దమనిషి ముస్లిములకు టిక్కట్లు మాత్రం ఇవ్వలేదు.

ముస్లిముల జనాభా, పార్లమెంటు, అసెంబ్లీల్లో వారి ప్రాతినిధ్యం పోల్చి చూస్తే చాలా చేదు వాస్తవాలు మన ముందుకు వస్తాయి. దేశ స్వాతంత్య్రం తర్వాతి నుంచి నేటి వరకు లోక్‌సభకు ఎన్నికైన ముస్లిముల సంఖ్య కేవలం 470మాత్రమే అంటే నమ్ముతారా? ఇది దేశంలో ముస్లిముల పట్ల కొనసాగుతున్న తీవ్ర వివక్షకు నిదర్శనం కాదా? వివిధ రాష్ట్రాల అసెంబ్లీల పరిస్థితి కూడా ఇదే. ఒకటి రెండు సార్లు ముస్లిముల ప్రాతినిధ్యం కాస్త పెరిగినట్లు కనబడిరది. 1980లో ఏడవ లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిములు 49మంది లోక్‌సభ సభ్యులుగా ఉన్నారు. 1984లో ముస్లిములు లోక్‌సభలో 46మంది ఉన్నారు. సగటున లోక్‌సభలో ముస్లిముల ప్రాతినిధ్యం 30మాత్రమే. మొదటి లోక్‌సభలో 21మంది, రెండవ లోక్‌సభలో 24మంది, మూడవ లోక్‌సభలో 23మంది, నాల్గవ లోక్‌సభలో 29మంది, ఐదవ లోక్‌సభలో 30మంది, ఆరవ లోక్‌సభలో 34మంది, ఏడవ లోక్‌సభలో 49మంది, ఎనిమిదవ లోక్‌సభలో 48మంది, తొమ్మిదవ లోక్‌సభలో 33మంది, పదవ, పదకొండవ, పన్నెండవ లోక్‌సభల్లో 28మంది, పదమూడవ లోక్‌సభలో 32మంది, పద్నాలుగవ లోక్‌సభలో 36మంది, పదిహేనవ లోక్‌సభలో 29మంది ముస్లిమ్‌ సభ్యులు మాత్రమే ఉన్నారు. పార్లమెంటులో అతితక్కువ మంది ముస్లిమ్‌ సభ్యులుండడానికి కారణం పార్టీలు వారికి టిక్కట్లు ఇవ్వకపోవడమే. మరోవైపు యస్‌.సి, యస్‌టీ వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం రిజర్వేషన్ల కారణంగా చాలా పెరిగింది. ఇప్పుడు మహిళలకు రాజకీయాల్లో 33శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తుంది. కాని ఇప్పటి వరకు పార్లమెంటులో సభ్యులుగా ఉన్న మహిళల సంఖ్య, పార్లమెంటులో సభ్యులుగా ఉన్న ముస్లిముల సంఖ్య కన్నా ఎక్కువ. మహిళలు 557మంది పార్లమెంటుకు వెళ్ళారు. కాని ముస్లిములు ఇప్పటి వరకు పార్లమెంటుకు వెళ్ళగలిగింది కేవలం 470మంది మాత్రమే. ఈ గణాంకాలు చూస్తే రాజకీయ రిజర్వేషన్లు ఎవరికి అవసరమో స్పష్టంగా అర్ధమవుతుంది.  నిజానికి దళిత బడుగు వర్గాల కన్నా, మహిళల కన్నా ఎక్కువగా ముస్లిములకు రాజకీయ రిజర్వేషన్ల అవసరం ఉంది. చట్టసభల్లో ముస్లిముల ప్రాతినిధ్యం తక్కువగా ఉండడానికి చాలా కారణాలున్నాయి. రాజకీయ పార్టీలు వారి హక్కును గౌరవించకపోవడం, వారికి తగిన సంఖ్యలో టిక్కట్లు ఇవ్వకపోవడం. రాజకీయ పార్టీలు ఒకవేళ ముస్లిములకు టిక్కట్లు ఇచ్చినా, ముస్లిముల జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యర్ధి పార్టీలు ముస్లిమ్‌ అభ్యర్ధిని నిలబెట్టిన ప్రాంతాల్లో టిక్కట్లిస్తాయి. దీనివల్ల ముస్లిమ్‌ ఓట్లు చీలిపోయి గెలుపు కష్టమయ్యే పరిస్థితి తలెత్తుతుంది. మరో ముఖ్యమైన విషయమేమంటే, సోకాల్డ్‌ సెక్యులర్‌ పార్టీలు తమ అభ్యర్ధులను గెలిపించే బాధ్యత ముస్లిములదే అన్నట్లు వ్యవహరిస్తాయి. సెక్యులరిజాన్ని కాపాడవలసిన బాధ్యత ముస్లిములదే అన్నట్లుగా మాట్లాడతాయి. ముస్లిములు కూడా మరో ప్రత్యామ్నాయమేదీ లేని పరిస్థితుల్లో ఈ సెక్యులర్‌ పార్టీలు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వకపోయినా వారిని గెలిపించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు ముస్లిములు కూడా తమ ఓట్లు చీలిపోతున్నాయన్నది గుర్తించకుండా వ్యవహరించడం వల్ల కూడా ముస్లిములు ఓడిపోతున్నారు. ఇదే సాకుగా చేసుకుని రాజకీయపార్టీలు ముస్లిములకు టిక్కట్లిస్తే గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని వాదిస్తున్నాయి కూడా. మరోవైపు టిక్కట్లిచ్చిన రాజకీయ పార్టీలు కూడా గెలుపు కష్టంగా ఉన్న నియోజకవర్గాల్లోనే టిక్కట్లివ్వడం, ముస్లిమ్‌ అభ్యర్ధిని గెలిపించడానికి పార్టీ యంత్రాంగాన్ని వాడకపోవడం కూడా మనకు కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో పార్టీ టిక్కట్టిచ్చినా అదే పార్టీ కార్యకర్తలు తమ అభ్యర్ధికి వ్యతిరేకంగా పనిచేయడం కూడా జరిగింది.

ఈ పరిస్థితుల్లో ముస్లిమ్‌ నాయకత్వం ఉనికిలోకి రావలసిన అవసరం ఉంది. ముస్లిముల రాజకీయ ప్రాతినిధ్యం పెంచడానికి తగిన ప్రయత్నాలు జరగాలి. అప్పుడే ముస్లిముల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

Check Also

geeturai_weekly_magazine_18_1

సదాచరణ

మనం మంచిగా ఎలా వ్యవహరించాలి? సేవలకు అర్హులైనవారెవరు? అనే విషయాలు ఇస్లాం చాలా స్పష్టంగా తెలియజేసింది. మనిషికి తన తల్లిదండ్రులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *