ఎండలో స్నానించిన మొగ్గ

ఎండలో స్నానించిన మొగ్గ

పువ్వై నవ్వుతుంది

ప్రతి రాత్రి ఉదయంగా వికసిస్తుంది

 

జీవితం నడిచెళ్ళిన బాటపై

వయసు సేదదీరుతోంది

చిరుగాలిలో కరిగిపోయే చెమటలా…

 

ఘనీభవించిన మనిషి

శిలాజమైన మనసు

చూపు పలుగైతే

అవశేషం ఒళ్ళు విరుచుకుంటుంది

 

కారుమబ్బుల నీడ గతిస్తే

చల్లని చెట్టునీడ స్పర్శిస్తుంది

నివురుగప్పిన బతుకు కూడా

గుండెతడికి జ్వలిస్తుంది

రహదారిపై నీడల గోడ

వెలుగు వానకు కరుగుతుంది

పంటిబిగువులో బలం ముందు

భ్రమల సైన్యం తలదించుతుంది..

 

అనామకుల కన్నీటి మెరుపుతో

రాజదర్బారు శోభిస్తుంది

కిరీటాల వజ్రకాంతులు

మట్టివెలుగుకు దాసోహమవుతాయి

 

నిరాకరణల మత్తులోనే

కొత్తబాధ మొలకెత్తుతుంది

విషాదాల సెలయేటిలో

స్వేచ్ఛ ఈత నేర్చుకుంటుంది

 

ఎదురుదెబ్బల మైలురాళ్ళు

దాటేదే ప్రయాణం

మూటలు కట్టిన నష్టాలను

మోసేదే వ్యాపారం

కొండను ఢీకొన్న

పొట్టేలుదే రణం

 

ఉల్లిపొరల్లా అధికారపు కథలు

ఆ వాసనకు రాలే నిరుపేద కన్నీటిబొట్టు

ఉప్పెనలా మారే రోజు..

ఆలస్యమేగాని అసంభవంకాదు

సాధ్యాసాధ్యాల ఉదయ సంధ్యలు

భ్రమించే బండి చక్రాలు

 

కాలం ఎవడి బానిస కాదు

గడిచిన రోజు ఎవడికీ తిరిగిరాదు

చర్మం ముడతల్లో నడుం వంచి

వయసును వెదుక్కోవడం ఎవరికైనా తప్పదు

ఏ దారి నుంచి ఏ క్షణం

వచ్చి పలకరిస్తుందో?

తుఫాను శ్వాసను

తీరం చేర్చకు…

(జకియా జాఫ్రీ నీ పోరాట పటిమకు వందనాలు)

Check Also

స్పెషల్ స్టొరీ: ఆపదలే ఆయుధం

‘‘అల్లాప్‌ా మీపై  ఉపకారం  చేశాడు.  ఆయన మీకు విశ్వాస సంపదను ప్రసాదించాడు’’. (17:49) ఇది ఎంతో సౌభాగ్యకరమైన విషయం. దీన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *